బాబు నాటి బాధలే మళ్ళీ వచ్చాయి

కాకినాడ :

‘చంద్రబాబు హయాంలో మన రాష్ట్రం మొత్తం అల్లాడిపోయింది. రైతులు, పేదలను చంద్రబాబు అసలు మనుషుల్లా కూడా చూడలేదు. ఇప్పుడు రాష్ట్రంలో మళ్లీ అవే పరిస్థితులు వచ్చిపడ్డాయి. వేసిన ప్రతి పంటా నష్టపోయి అప్పులపాలైపోయాం.. ఆదుకునేవారు లేరని రైతులంతా చెబుతున్నారు. ఉప్పు, పప్పు, నూనె, చక్కెర ఏది ముట్టుకున్నా ధరలు షాక్‌ కొడుతున్నాయి.. ఏదీ కొనేటట్టు లేదని ప్రతి మహిళా ఆవేదన వ్యక్తం చేస్తోంది. కొన్ని నెలలు వేచి ఉండండి. మళ్లీ రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మన రాష్ట్రం కళకళలాడుతుంది. రాజన్న రాజ్యం రాకపోతే మన రాష్ట్రం బాగుపడదు. గ్రామాలు బాగుపడవు. మన కుటుంబాలూ బాగుపడవు. మన పిల్లలు చదువుకోలేరు. ఆరోగ్యశ్రీ ఉండదు. ఇలా ధరలు పెరుగుతూ పోతుంటాయి.. ఈ నరకం ఇక మనకొద్దు’ అని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల అన్నారు.

ప్రజా సమస్యలు పట్టిచుకోని కంటక కాంగ్రెస్ ప్రభుత్వ‌ం తీరుకు, దానితో కుమ్మక్కై, నిస్సిగ్గుగా రక్షణ కవచంలా నిలుస్తున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా శ్రీమతి షర్మిల చేస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 179వ రోజు శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ‌కొనసాగింది. కాకినాడ రూరల్ ‌నియోజకవర్గం తిమ్మాపురంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో శ్రీమతి షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు, విద్యార్థులు, మహిళలు, కూలీలు తమ గోడు చెప్పుకొన్నారు. శ్రీమతి షర్మిలకు కరెంటు కష్టాలు, కరెంటు చార్జీల మోత, రైతుల సమస్యలు, మంచినీరు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, డ్వాక్రా మహిళల కష్టాలు, బెల్టుషాపులకు సంబంధించిన అనేక సమస్యలను వారు తెలిపారు. వారి కష్టాలు విని ఉద్వేగానికి గురైన శ్రీమతి షర్మిల మాట్లాడుతూ.. పై విధంగా వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు శ్రీమతి షర్మిల అచ్చంపేట జంక్షన్‌లో మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి శ్ర‌ద్ధాంజలి ఘటించారు.

చంద్రబాబు హయాంలో గ్రామాల్లోని రైతులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోయే దుస్థితి వచ్చిపడింది. ఆ రోజుల్లో మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాక రైతులకు రుణమాఫీ చేయించారన్నారు. 7 గంటల పాటు ఉచిత విద్యుత్‌ అందించారన్నారు. ఆయన పరిపాలనలో ఎన్నో అభివృద్ధి పథకాలు అమలు చేశారే కానీ ఏనాడూ నిత్యావసరాలపై చార్జీలు పెంచని రికార్డు ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి నిలిచారన్నారు.

ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు..
‘మళ్లీ మాకు రాజన్న రాజ్యం కావాలని ప్రజలంతా కోరుతున్నారు. దీనికి కారణం రాజశేఖరరెడ్డి అద్భుతమైన పథకాలు ఒకటైతే.. పెద్ద మనసు చేసుకుని ఆయన ఒక్క రూపాయి చార్జీ కూడా పెంచకపోవడం మరో కారణం. అందరూ కోరుతున్నట్లే త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఏ ఒక్కరూ గుడిసెల్లో ఉండాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు అందించే బాధ్యత జగనన్న తన భుజాన వేసుకుంటారు. రైతన్న తాను పండించిన పంటను మార్కెట్‌లో లాభానికి అమ్ముకోలేకపోతే.. ఆ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతారు. రైతులంతా లాభపడేలా చూస్తారు. రైతులకు, మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు.

వడ్డీ లేకుండా రుణాలిస్తామని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారు. అయితే ఆయనకు విలువ, విశ్వసనీయత లేదు. అందుకే మాట ఇచ్చి ప్రచారం చేసుకుంటున్నారు కానీ.. ఒక్కరికీ వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం లేదు. కానీ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్‌రెడ్డి విలువలు, విశ్వసనీయత కోసం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్ని కష్టాలైనా పడే మనిషి. జగనన్న సిఎం అయ్యాక రైతులు, మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. ఫీజు రీయింబర్సుమెంటు, ఆరోగ్య శ్రీ, అభయ హస్తం లాంటి పథకాలకు మళ్లీ జీవం పోస్తారు' అని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు.

బెల్టు షాపులపై బ్యాన్ :
రాబోయే రాజన్న రాజ్యంలో ఊళ్లలో బెల్టుషాపులు ఉండ‌వని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు. ఒక నియోజకవర్గానికి ఒకే మద్యం షాపు ఉంటుందంతే అన్నారు. ప్రతి మహిళా తలెత్తుకుని మా కుటుంబం బాగుందనుకునే రోజు త్వరలోనే వస్తుందన్నారు. మన రాష్ట్రం, మన గ్రామం, మన కుటుంబాలు బాగుపడతాయి. ప్రతి వెయ్యి మంది ఉన్న గ్రామాల్లో బెల్టుషాపులు లేకుండా చూసేందుకు మహిళా పోలీస్‌ స్టేషన్ ఏర్పాటు చేస్తాం. రాజన్న రాజ్యం రావాలంటే మీరు ఒక్కటే చేయాలి. రాబోయే ఎన్నికలన్నింటిలో కాంగ్రెస్, ‌టిడిపిలకు బుద్ధి చెప్పి.. వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయడం. తద్వారా రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందాం’ అని పిలుపునిచ్చారు.

రోజుకి 4 గంటలే కరెంటు :

రచ్చబండలో ‘అమ్మా.. కరెంటు ఎన్ని గంటలు వస్తోంది?’ అని శ్రీమతి షర్మిల అడిగినప్పుడు.. మహిళలందరూ నాలుగు గంటలే వస్తోందని చెప్పారు. దీంతో శ్రీమతి షర్మిల ‘24 గంటలకు 4 గంటలు మాత్రమే వస్తుందా?’ అని అడిగితే ‘అవును, అవును’ అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. మహానేత వైయస్ అమలుచేసిన సంక్షేమ పథకా‌లకు కిరణ్‌ ప్రభుత్వం భ్రష్టు పట్టించిన తీరును శ్రీమతి షర్మిలకు వివరించారు. ‘అమ్మా.. మీ నాన్న మా కోసం ఎన్నో పథకాలు పెట్టారు. కానీ అవేవీ ఇప్పుడు అమలు జరగడం లేదమ్మా'. ప్రస్తుతం గ్రామాలలో చదువుకున్న వారందరూ ఉపాధి లేక ఖాళీగా ఉంటున్నారమ్మా’ అని పెందుర్తి సుందరి ఉద్వేగంగా చెప్పింది.

దివ్య అనే యువతి మాట్లాడుతూ.. ‘మా నాన్న గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఇప్పటికే రెండు సార్లు ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేశారు. మరోసారి చేయటం కుదరదంటున్నారు. మా నాన్నకు మేం ముగ్గురు ఆడపిల్లలం, ఒక తమ్ముడు ఉన్నాం. మా నాన్న లేకపోతే మాకు దిక్కులేదు. మా నాన్న కష్టమ్మీదే మేం బతుకుతున్నాం. మీరే మాకు సహాయం చేయాలమ్మా’ అంటూ కన్నీరుమున్నీరైంది. ఆమె కష్టాలు విని చలించిపోయిన‌ శ్రీమతి షర్మిల వైద్యులతో మాట్లాడి వీలైనంత సాయం చేస్తామని ధైర్యం చెప్పారు. ‘పావలా వడ్డీ అన్నారు. తరువాత వడ్డీలేని రుణాలు అన్నారు. కానీ తీసుకున్న రుణాలకు రుపాయి వడ్డీ పడుతోంది. రాజశేఖరరెడ్డి సమయానికి అందించే డ్వాక్రా రుణాలు ఇప్పుడు ఇచ్చే వారే కనిపించటం లేదు’ అంటూ సత్యవతి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

శుక్రవారం నాటి పాదయాత్ర ముగిసే సమయానికి శ్రీమతి షర్మిల మొత్లం 2,372 కిలో మీటర్లు నడిచారు.

Back to Top