తెలుగు తమ్ముళ్లూ మాకు అన్నదమ్ములే

విశాఖపట్నం:

‘తెలుగు తమ్ముళ్లూ.. మాతో కలిసిపోతున్నారా..? మీరంతా మా అన్నదమ్ములే. కానీ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీలోకి చంద్రబాబుకు మాత్రం నో ఎంట్రీ‌ (ప్రవేశం లేదు)’ అని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విశాఖపట్నం లోక్‌సభా స్థానానికి శ్రీమతి వైయస్ విజయమ్మ గురువారం నామినేష‌న్ వేశారు.‌ ఈ కార్యక్రమానికి శ్రీమతి షర్మిల హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఆసక్తికర‌మైన సన్నివేశం చోటుచేసుకుంది. శ్రీమతి విజయమ్మ నామినేషన్ వేసిన అనంతరం కలెక్టరే‌ట్ ప్రాంగణం వద్ద పార్టీ శ్రేణులను‌ ఉద్దేశించి శ్రీమతి షర్మిల ప్రసంగిస్తుండగా.. టీడీపీ అభ్యర్థి నామినేషన్‌కు మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు కూడా వచ్చాయి. దీంతో వారిని ఉద్దేశించి శ్రీమతి షర్మిల పైవిధంగా స్పందించారు.

'తెలుగు తమ్ముళ్లూ ఒక్క మాటకు సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడున్న కాంగ్రెస్ ఓడిపోతే.. పాపం అల్లుడు కదా.. అని ఎ‌న్‌టీఆర్ దయతలచి టీడీపీలోకి తీసుకొచ్చారు. చంద్రబాబు కన్ను ఎ‌న్‌టీఆర్ కుర్చీపై పడింది. అంతే క్షణం ఆలోచించలేదు. సొంత మామ అని కూడా చూడకుండా.. పట్టపగలే.. కళ్లార్పకుండా వెన్నుపోటు పొడిచారు. ఎన్‌టీఆర్‌ను కాళ్లు పట్టి లాగి మరీ కుర్చీ తీసేసుకున్నారు. ఏ పార్టీ అని మీరు చెప్పుకుంటున్నారో.. ఎన్‌టీఆర్ స్థాపించిన టీడీపీ నుంచే ఆయనను వెలేశారు. మీకు ఎంత గతిలేకపోతే అలాంటి చంద్రబాబును నాయకుడిగా పెట్టుకుంటారు? జగనన్న సీఎం అవుతాడు.. జగనన్న పాలనలో మీరు, మీ కుటుంబాలు కూడా లబ్ధి పొందుతాయి' అన్నారు.

పేదల పక్షాన నిలిచింది జగనన్నే :
'సూటిగా అడుగుతున్నా.. ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఎప్పుడైనా జనం కోసం పోరాడారా? నిద్రలేచినప్పటి నుంచి ఎప్పుడూ.. శ్రీ జగన్  జపమే. ప్రజల కోసం పోరాడింది, వారి సమస్యలపై ఉద్యమించింది జగనన్న ఒక్కరే. ఎండనకా.. వాననకా.. రేయనకా.. పగలనకా.. ప్రజల మధ్యనే గడిపారు. పేద విద్యార్థులు, వారి ఫీజు రీయింబ‌ర్సుమెంట్ కోసం వారం రోజులు నిరాహార దీక్ష చేశా‌రు. రైతుల కోసం, చేనేత కార్మికుల కోసం రోజుల తరబడి నిరాహార దీక్ష చేశారు జగనన్న. మీ చంద్రబాబుకు అప్పుడైనా బుద్ధొచ్చిందా?' అని ప్రశ్నించారు. 'మండుటెండను సైతం లెక్కచేయకుండా తెలుగు తమ్ముళ్లు సైతం మా కోసం ఇంతటి ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు చూపుతున్నందుకు మీకు శిరసు వంచి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా’ అన్నారు.

తాజా వీడియోలు

Back to Top