జగనన్న మేనిఫెస్టోకు అంబేద్కరే స్ఫూర్తి

ఖమ్మం:

అంబేద్కర్‌ లాంటి మహనీయుల స్ఫూర్తితో దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ పథకా‌లు ప్రవేశపెట్టారని.. అదే అంబేద్కర్ స్ఫూర్తితో జగనన్న తన ‌ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారని వైయస్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల తెలిపారు. ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండవ రోజు సోమవారం ఆమె జిల్లాలోని ఖమ్మం, వైరా, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల్లో పర్యటించారు.

ఉదయం ప్రచారం ప్రారంభించగానే అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్టీ  జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీమతి షర్మిల పాల్గొన్నారు. అంబేద్కర్, వైయస్ఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లాలో పలు‌ చోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు విశేష సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.

'వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రతి ఒక్కరికీ భరోసా కల్పించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా గడపగడప‌కూ సంక్షేమ పథకాలు అందేలా చూశారు. వైయస్ఆర్ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రె‌స్‌ పార్టీ ఆయన మరణించిన తర్వాత ఒక్కొటొక్కటిగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వాస్తవం. ఇప్పుడు కావాల్సింది సంక్షేమరాజ్యం. వై‌యస్ఆర్‌లా ఫీజు రీయింబర్సుమెంట్, ఆరోగ్యశ్రీ, డ్వాక్రా, రైతుల రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలతో ప్రజల ప్రేమను గెలుచుకునే వారెవరనేది ప్రజలు ఆలోచించాలి. సమర్థ‌ నాయకుడిని ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైంద'ని ప్రజలకు శ్రీమతి షర్మిల గుర్తుచేశారు.

మహానేత వైయస్ఆర్ పథకాలను కొన సాగించేందుకు, రాజన్న రాజ్యం తెచ్చేందుకే వై‌యస్‌ఆర్‌సీపీ పుట్టిందని శ్రీమతి షర్మిల అన్నారు. మహానేత ఆశయాలు సాధించడమే వైయస్‌ఆర్‌సీపీ లక్ష్యం అని పేర్కొన్నారు. ఓటేసే సమయంలో ఒక్కసారి వైయస్ఆర్‌ను గుండెలనిండా గుర్తు తెచ్చుకోండి అని విజ్ఞప్తిచేశారు. వైయస్ఆర్ పాలన తిరిగి తెచ్చేందుకు అసెంబ్లీ, పార్లమెంటరీ స్థానాల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వై‌యస్ఆర్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండని శ్రీమతి షర్మిల ఓటర్లను కోరారు.

వాతలెన్ని పెట్టుకున్నా నక్క నక్కే :
'వైయస్ రాజశేఖరరెడ్డి ఏ పథకాలు అమలు చేశారో అవే పథకాలను తాను ప్రవేశపెడతానని చెబుతున్నారు చంద్రబాబు. వై‌యస్‌ఆర్ ఉచిత విద్యు‌త్ ఇస్తే.. తానూ ఉచిత విద్యు‌త్ ఇస్తానంటున్నారు. వై‌యస్‌ఆర్ రుణమాఫీ చేస్తే.. తానూ చేస్తానంటున్నారు. వై‌యస్‌ఆర్ ఫీజు రీయంబ‌ర్సుమెంట్ ప్రవేశపెడితే... తాను ఉచితంగా విద్య‌ను అందిస్తానంటున్నారు. ఎన్నివాతలు పెట్టుకున్నా.. నక్క నక్కే, పులి పులే అన్నారు.

ఖమ్మం జిల్లాలో ఎన్నికల పర్యటన చేసిన శ్రీమతి షర్మిల వెంట పార్టీ ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటరీ స్థానాల్లోని అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకటరావు, ఖమ్మం, వైరా, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు నాగభూషణం, బాణోతు మదన్‌లాల్, డాక్టర్ రవిబాబు నాయక్, వనమా వెంకటేశ్వరరావు, పాయం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

Back to Top