ఈ పరిణామాలు కాంగ్రెస్ కుట్రలో భాగమే

హైదరాబాద్ 09 ఆగస్టు 2013:

రాష్ట్రంలోని ప్రస్తుత పరిణామాలు కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగమేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాజిరెడ్డి గోవర్థన్ ఆరోపించారు. సీడబ్ల్యూసీ తెలంగాణకు అనుకూలమని నిర్ణయం వెలువడిన పదిరోజులకు సీఎం నిన్న బయటకు వచ్చి, దీనికి కారణం మహానేత డాక్టర్ వైయస్ఆర్ రాజశేఖరరెడ్డి కారణమని ఓ అభాండం వేశారన్నారు. మొదట్నుంచీ తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిగారు అన్ని పార్టీలకూ సమన్యాయం జరగాలని కోరుకుంటున్నారన్నారు. ఓ తండ్రిలాగా కేంద్రం తీర్పివ్వాలని అడిగారన్నారు. దీనినే ముఖ్యమంత్రి మాట్లాడారనీ, ఇంతవరకూ నోరెందుకు మెదపలేదని ప్రశ్నించారు. నోరు విప్పడం కూడా సోనియా గాంధీ ఆదేశాలమేరకే చేశారని తాము భావిస్తున్నామని చెప్పారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలమని చెప్పించిన తర్వాత, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నాయకుడు ముందుకొచ్చి సీమాంధ్రకు అన్యాయం జరుగుతోంది కాబట్టే నోరు విప్పానంటున్నారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. వెంటనే డీఎస్, రాజనరసింహ ముఖ్యమంత్రిని తప్పుబడుతూ రాజీనామా చేయాలని డిమాండు చేశారన్నారు. ఈ రెండు ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ నేతలను ఉసిగొల్పుతూ చోద్యం చూస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే సోనియాగాంధీని ఈ పరిణామాలపై నిలదీయాలని సూచించారు. రాష్ట్రం అగ్నిగుండంగా మారిందనీ దీనికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలనీ బాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి పాలించే హక్కు లేదని స్పష్టంచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇచ్చి ఆ రకంగా మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. తెలంగాణ ప్రాంతానికి ఒక్క పైసా కూడా ఇవ్వనన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డేనని గుర్తుచేశారు. ఫలానా ప్రాంతానికి అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి చెప్పారు తప్ప .. చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పలేదన్నారు. ఆ విషయాన్ని వెల్లడించి ఉంటే బాగుండేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని పల్లెత్తు మాటనలేదన్నారు. తెలంగాణ ప్రాంత నాయకులు కూడా అంతేనన్నారు. ముఖ్యమంత్రి పదవికోసం పోటీపడి తమ పార్టీ నాయకుడినే దూషిస్తున్నారన్నారు. ఈ వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. తమ నేత జగన్మోహన్ రెడ్డిగారు చెప్పినట్లే అందరూ సమన్యాయం చేయమని కోరుతున్నారన్నారు. చంద్రబాబు కూడా త్వరలో తమ దారికే వస్తారని చెప్పారు. ఆంటోని కమిటీలో అంతా కాంగ్రెస్ పార్టీవారేనని, కాబట్టి ఇదంతా ఆ పార్టీ ఆడుతున్న డ్రామా అన్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ప్రాబల్యం తగ్గుతుందనీ, మహానేతను ఈ విషయంలో నిందిస్తే సీమాంధ్ర ప్రాంతంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టవచ్చే ఆలోచనతోనే డాక్టర్ వైయస్ఆర్ మీద ఆరోపణలు చేస్తున్నారని బాజిరెడ్డి ఓ ప్రశ్నకు బదులు చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు కాటకాలతో అల్లాడుతోందనీ, ఆయన విజన్ 20:20 అంటున్నారు తప్ప తమ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడంతో అప్పుడున్న 42ఎమ్మెల్యేలమంతా కలిసి  మా ప్రాంత అభివృద్ధికి తెలంగాణ కావాలని కోరుతూ సోనియా గాంధీని కలిసి లేఖ ఇచ్చామన్నారు. ఆమె దానిని అప్పటి ఎన్డీయే ప్రభుత్వానికి పంపారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకే చిత్తశుద్ధి ఉంటే 2004లో అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకివ్వలేదని బాజిరెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టడం కోసమే.. డాక్టర్ వైయస్ఆర్ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తోందని భావిస్తున్నాన్నారు.

తాజా ఫోటోలు

Back to Top