స్థానిక ఎన్నికలలో సత్తా చూపండి

విజయవాడ 22 జూన్ 2013:

స్థానిక ఎన్నికలలో పార్టీ కార్యకర్తలు తమ సత్తా చాటాలనీ, మహానేత ఆశయాలను, జగన్మోహన్ రెడ్డిగారి ఆకాంక్షలను చాటిచెప్పాలనీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పిలుపునిచ్చారు. విజయవాడలో శనివారం ఏర్పాటైన ప్రాంతీయ సదస్సుకు శ్రీమతి వైయస్ విజయమ్మ హాజరయ్యారు. కృష్ణ, పశ్చిమ  గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు.

రాజశేఖరరెడ్డిగారి ఆశయాలను, జగన్ బాబు ఆంకాంక్షలను నెరవేర్చేలా కార్యకర్తలు పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. గ్రామాల్లో కనీస వసతులు కరవయ్యాయి. సకాలంలో ఎన్నికలు జరిగుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కరవైందన్నారు. సమస్యలు పక్కనపెట్టి ఐకమ్యంతో పనిచేయాలన్నారు. స్థానికి ఎన్నికలు కార్యకర్తలకు మంచి అవకాశమని ఆమె చెప్పారు. పార్టీని పటిష్టం చేసుకోవడానికి చక్కటి వేదిక ఈ ఎన్నికలని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల నిధులు మురిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కరెంటు బిల్లులను అవే చెల్లించుకోవాల్సి వస్తోందని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ. 2 వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు.

పల్లెలు అంధకారంలో ఉన్నాయన్నారు. ఇప్పటికి 12 సార్లు ఎరువుల ధరలు పెరిగాయన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఏనాడు చార్జీలు పెంచని విషయాన్ని ఆమె గుర్తుచేశారు. జవాబుదారీతనం లేని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలని ఆమె ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని స్పష్టంచేశారు. రాజీవ్ ఉద్యోగశ్రీని రాజీవ్ యువ కిరణాలు పేరిట కొత్త పథకంగా కిరణ్ కుమార్ రెడ్డి మార్చారనీ, లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పినా ఆ జాడే కనిపించడం లేదనీ ఆమె తెలిపారు.

రెండేళ్ళ క్రితం పుట్టిన మన పార్టీని బలోపేతం చేయడానికీ, ప్రత్యర్థులకు మన సత్తా చాటడానికీ ఈ ఎన్నికలు మంచి అవకాశమని శ్రీమతి విజయమ్మ చెప్పారు. ప్రజల్లో ఉన్న ఆదరణను పునాదిగా మలచుకుని పార్టీని పటిష్టం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యకర్తలు స్థానిక ఎన్నికల్లో నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా గ్రామీణులకు సేవ చేయాలనీ, ఇందుకు అవసరమైన తోడ్పాటును పార్టీ అందిస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. ప్రజల్లో పార్టీకి ఉన్న అనుకూలతను సానుకూలంగా మలచుకోవాలని సూచించారు.

రాజశేఖరరెడ్డిగారి అనంతరం ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేసుకుంటూ వచ్చారన్నారు. గ్రామాలలో కనీస వసతులు అంటే పారిశుద్ధ్యం, వీధి దీపాలు, మంచినీరు, తదితరాలు కరవయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధులే ఉండి ఉంటే వారే అధికారులను నిలదీసి పనులు చేయించుకుని ఉండేవారన్నారు. ఎన్నికలు సకాలంలో నిర్వహించనందునే ఈ దుర్భర పరిస్థితి ఏర్పడిందని శ్రీమతి విజయమ్మ అభిప్రాయపడ్డారు. పెత్తనం నాయకుల చేతుల్లో ఉన్నప్పటికీ ప్రజల బాగోగులు చూడటం లేదు సరికదా.. పన్నులు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు చట్టానికీ, నాయకులు ప్రజలకు జవాబుదారిగా ఉంటారన్నారు. స్థానిక ఎన్నికలకు జనాభా లెక్కలను ఏ ఏడాది నుంచి ప్రాతిపదికగా తీసుకోవాలనే అంశంపై వాదులాడుకుంటూ కొంతకాలం తాత్సారం చేశారని చెప్పారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరవు
ప్రతి  అంశంలోనూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందన్నారు. మున్సిపల్ ఎన్నికలను గడువులోగా నిర్వహించాలని కోర్టు ఆదేశించినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం 60.5% రిజర్వేషన్లని అంటోందనీ.. కానీ అవి 50 శాతం మించకూడదన్న కోర్టు ఆదేశాలను చూపించి ఎన్నికల నిర్వహణను జాప్యం చేసిందన్నారు. 34% బీసీలు, 8.25% ఎస్సీలు, 18.3% ఎస్టీలు, మహిళలకు 50% రిజర్వేషన్లు ఉండాలని చెబుతున్నారన్నారు.  బీసీ జనాభాను దీనికి ప్రాతిపదికగా తీసుకుందామనీ,  దీనివల్ల సమస్య పరిష్కారమవుతుందనీ  తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కారాన్ని సూచించారని శ్రీమతి విజయమ్మ తెలిపారు. ఈమేరకు ఆయనో లేఖ రాసినప్పటికీ ఏ పార్టీ స్పందించలేదన్నారు. రాజశేఖరరెడ్డిగారు పాత పద్ధతి ప్రకారమే ఎన్నికలు నిర్వహించారనీ, ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదనీ చెప్పారు.
మురిగిపోతున్న నిధులు
స్థానిక సమస్యలకు నిధులు.. విధులూ కూడా ముఖ్యం. గాంధీ సూత్రాన్ని ఈ అంశంలో మనం పాటించడం లేదన్నారు. ఈ రెండేళ్ళలో నాలుగు వేల కోట్ల రూపాయలు నిలిచిపోయాయని తెలిపారు. బీఆర్‌జీఎస్ కింద వచ్చిన 350 కోట్ల రూపాయలు మురిగిపోయాయన్నారు. పంచాయతీలకు 29     అధికారాలను ప్రభుత్వం ఇంతవరకూ బదలాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2013-2014కి కూడా 2400 కోట్ల రూపాయల నిధులు నిలిచిపోయాయని తెలిపారు. మైనర్ పంచాయతీల కరెంటు బిల్లులను ప్రభుత్వమే భరించాలి.. కానీ ఈ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా అవే భరించుకోవాలని ఆదేశించడంతో గ్రామాలు చీకట్లో మగ్గవలసిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. దీనివల్ల నీళ్ళు రావడం లేదు. మొత్తం మీద పంచాయతీలు చతికిలపడ్డాయన్నారు. నామినేషన్ మీద పనులు కేటాయిస్తున్నారని తెలిపారు.

స్థానిక సంస్థలకు అధికారం అవసరం లేదన్న బాబు

స్థానిక సంస్థలకు ఎటువంటి అధికారం ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు నాయుడు తన మనసులో మాట అనే పుస్తకంలో రాసుకున్నారన్నారు. ఆయన కాలంలో రెండు వేల 400 కోట్ల రూపాయల కేంద్ర నిధులు ఆగిపోయాయని చెప్పారు. నిధులు, విధులను పంచాయతీలకు ఇచ్చే చిత్తశుద్ధి ఆయనలో కొరవడిందన్నారు. రాజశేఖరరెడ్డిగారు స్థానిక సంస్థలకు ఈ రెండింటినీ ఇవ్వడమే కాక అన్ని సౌకర్యాల కల్పనకూ పాటుపడ్డారన్నారు. అప్పట్లో స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ వర్తింపజేశారనీ, వారికి కౌన్సిల్లో ప్రాతినిధ్యం కల్పించారనీ శ్రీమతి విజయమ్మ తెలిపారు. 22 జడ్సీలు 1090 జడ్సీటీసీలు, 21834 పంచాయతీలు, 16168 ఎమ్పీటీసీలు, 182 మున్సిపాలిటీలు, 19 కార్పొరేషన్లకు కలిపి మొత్తం రెండున్నర లక్షల మంది ప్రజాప్రతినిధులు ఈ రెండున్నరేళ్ళుగా లేరని వివరించారు.  కేంద్రం నుంచి నిధులు విడుదల కాకపోవడం, ఎన్నికలకు వత్తిడి వస్తుండడంతో ప్రభుత్వం దిగివచ్చి సంసిద్ధమవుతోందన్నారు. ఇది మన పార్టీకి ఒక రూపు కల్పించుకోవడానికి లభించిన మహత్తర అవకాశంగా కార్యకర్తలు భావించాలన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండదండగా ఉంటుందన్నారు. సొసైటీ ఎన్నికలలో అక్రమాలకు పాల్పడి గెలిచిన ప్రభుత్వం స్థానిక ఎన్నికలలో కూడా ఇదే తరహా శైలికి తెరతీస్తోందని చెప్పారు. ఇటువంటి యత్నాలను తిప్పికొట్టాలని శ్రీమతి విజయమ్మ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఏ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కవుతున్నాయనీ, అవెలా వచ్చినా అప్రమత్తంగా ఉండి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠను దెబ్బదీయడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. ఎన్నికలలో గెలుపునకు డబ్బు, మద్యం విచ్చలవిడిగా ఖర్చు చేస్తారనీ, పోలీసు యంత్రాంగాన్ని వినియోగించుకుంటారనీ ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా వ్యవహరించాలనీ సూచించారు.

Back to Top