షర్మిల పాదయాత్రకు వికలాంగ సంఘాల మద్దతు

హైదరాబాద్, ‌15 అక్టోబర్‌ 2012: రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మహానేత వైయస్‌ కుమార్తె, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టనున్న పాదయాత్రకు వికలాంగుల హక్కుల వేదిక, ‘రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఫర్ ది డె‌ఫ్’ సంఘాలు మద్దతు ‌ప్రకటించాయి. వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్‌రావు  హైదరాబాద్‌లో ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.  ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, సమస్యల పరిష్కారంలో విఫలమైన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తూ, అసమర్ధ ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్న ప్రధాన ప్రతిపక్షం తీరును ఆక్షేపిస్తూ శర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను చేపడుతున్న విషయం తెలిసిందే.

వికలాంగులకు పింఛన్లు ఇచ్చిన ఘనత మహానేత వైయస్‌రాజశేఖరరెడ్డిదే అని నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం చేసే షర్మిల పాదయాత్రకు రాష్ట్రంలోని 10 లక్షల మంది వికలాంగులు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. వికలాంగులకు రూ.75 పింఛను ఇవ్వలేని చంద్రబాబు ఇప్పుడు  వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన పాదయాత్ర సందర్భంగా తొక్కిసలాటలో ఒక వికలాంగుడు మృతి చెందితే కనీసం పలకరించని చంద్రబాబు తీరును తప్పుపట్టారు. మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

ఈ నెల 18న తలపెట్టిన ‘చలో బ‌స్‌భవన్’, వికలాంగుల ధర్నాను విజయవంతం చేయాలని ‘రూర‌ల్ డెవల‌ప్‌మెంట్ సొసైటీ ఫ‌ర్ ది డె‌ఫ్’ అధ్యక్షు‌డు వీవీఎస్ఎ‌ల్‌కేఎం ప్రసాద్ కోరారు. సమావేశంలో వికలాంగుల నాయకులు పి.శ్రీనివా‌స్, సత్యనారాయణ, శ్రీనివా‌స్, ప్రసా‌ద్ పాల్గొన్నారు.
Back to Top