షర్మిల పాదయాత్రకు ఆదివారం విరామం

హైదరాబాద్, 15 డిసెంబర్ 2012:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ  వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేపట్టిన 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్రకు ఆదివారం కూడా విరామం ప్రకటించారు. మోకాలి గాయం నొప్పి ఇంకా తగ్గకపోవడంతో శ్రీమతి షర్మిల పాదయాత్రకు దూరంగా ఉండనున్నారు.

     రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో శ్రీమతి షర్మిల కాలు బెణికింది. గాయంతో బాధపడుతూనే 6 కిలో మీటర్ల మేరకు పాదయాత్ర చేశారు. అనంతరం విశ్రాంతి సమయంలో వైద్యుల బృందం శ్రీమతి షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించింది. మోకాలి లిగమెంట్‌కు గాయమైందని ఆమెను పరీక్షించిన వైద్యుడు ఆనంద్ తెలిపారు. వైద్యుల సూచన మేరకు శ్రీమతి షర్మిల శనివారం, ఆదివారం విశ్రాంతి తీసుకుంటున్నారని మరో ప్రజాప్రస్థానం సమన్వయ కమిటీ సభ్యుడు తలశిల రఘురాం తెలిపారు.

     అక్టోబర్ 18న ఇడుపులపాయలో శ్రీమతి షర్మిల చేపట్టిన పాదయాత్ర కడప, కర్నూలు, అనంతపురం, మహబూబ్ నగర్ జిల్లాల మీదుగా రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. 57 రోజులపాటు కొనసాగిన పాదయాత్రలో 824 కిలో మీటర్ల వరకు శ్రీమతి షర్మిల నడిచారు. షెడ్యూలు ప్రకారం శ్రీమతి షర్మిల సోమవారం తన పాదయాత్రను కొనసాగిస్తారని రఘరాం తెలిపారు.

Back to Top