'సెయింట్‌ జోసెఫ్‌' నుండి ప్రారంభమైన పాదయాత్ర

కర్నూలు, 22 నవంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం 36వ రోజుకు చేరింది. అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజల ఆదరాభిమానాల మధ్య కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర నేటి మధ్యాహ్నం కర్నూలు జిల్లాలో ముగిసి పాలమూరు జిల్లాలో ప్రారంభమవుతుంది. బుధవారం రాత్రి బస చేసిన సెయింట్ జోసెఫ్ కాలే‌జ్ నుంచి‌ షర్మిల గురువారం పాదయాత్రను ప్రారంభించారు. మామిడాలపాడు, తుంగభద్ర బ్రిడ్జి మీదుగా ఆమె పాదయాత్ర పుల్లూరు చేరుకుంటుంది. పుల్లూరులో ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

అక్కడి నుండి షర్మిల తన పాదయాత్రను కలుగొట్ల, పోతులపాడు క్రాస్‌రోడ్ మీదుగా బొంకూరు వరకు ‌కొనసాగిస్తారు. ఈ రాత్రికి షర్మిల బొంకూరు శివారులో బసచేస్తారు. గురువారంనాటి పాదయాత్రలో పార్టీకి చెందిన నెల్లూరు లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, అమర్‌నాథరెడ్డి, తెల్లం బాలరాజు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
Back to Top