సమస్యల‌ను తక్షణమే పరిష్కరించే వైయస్

హైదరాబాద్‌, 18 సెప్టెంబర్‌ 2012: రాష్ట్రంలో ప్రజా సమస్యలకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్ ‌రాజశేఖరరెడ్డి తక్షణమే పరిష్కారాలు చూపేవారని హైదరాబాద్‌ పార్లమెంటు సభ్యుడు, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. వైయస్ఆ‌ర్ కుటుంబం అంటే తమ‌కుం ఎంతో గౌరవమని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలోని వైయస్‌ఆర్‌ సిఎల్‌పిలో అసదుద్దీన్‌ ఒవైసీ తన సోదరుడు, ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీతో కలసి మంగళవారం ఉదయం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మతో భేటి అయ్యారు. ఈ సమావేశంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు,మజ్లిస్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. శాసనసభ విషయాలతో పాటు జగన్‌ బెయిల్‌ తదితర అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన మహానేత డాక్టర్‌ రాజశేఖరరెడ్డి అని 
వైయస్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని విజయమ్మతో అసదుద్దీన్‌ పంచుకున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తరచూ వైయస్‌తో సమావేశమయ్యేవాడినని అన్నారు. ఇప్పుడు వైయస్‌ విజయమ్మ కూడా ప్రజాసమస్యలపై పోరాడుతున్నారని అసదుద్దీన్ అన్నారు. కొద్ది రోజుల క్రితం అసదుద్దీన్‌ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ, జగన్మోహన్‌రెడ్డి తనకు మంచి మిత్రుడు అని చెప్పారు. ఇటీవల ఒకసారి ఆయన జైలుకు వెళ్లి జగన్‌ను పరామర్శించారు.
Back to Top