2019లో వైయస్‌ఆర్‌ సీపీకి 150 సీట్లు

వైయస్‌ జగన్‌ను సీఎం చేసేందుకు ప్రజలంతా సిద్ధం
ప్రజా సంక్షేమమే వైయస్‌ఆర్‌ సీపీ లక్ష్యం
ఏడేళ్ల కాలంలో ఎన్నో ఉద్యమాలు, ఆటుపోట్లు
సడలని సంకల్పంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి వైయస్‌ జగన్‌
తండ్రి ఆశయాలను బతికించడమే జననేత ధ్యేయం
ఒకే ఇంట్లో ముగ్గురి పాదయాత్ర రికార్డు
ప్రకాశం: 2019 ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 150 అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకుంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో మోసపోయిన ప్రజలంతా వైయస్‌ జగన్‌ను సీఎం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై ఎలాంటి పోరాటాలకు పిలుపునిచ్చినా జనం స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేస్తున్నారన్నారు. ప్రకాశం జిల్లా ఈపురుపాలెంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. 2011 మార్చి 12వ తేదీన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించిందని, ఏడేళ్లు పూర్తి చేసుకున్న వైయస్‌ఆర్‌ సీపీ దేశంలో ఒక చరిత్రలో సృష్టించిందన్నారు. ఎన్నో ఆటుపోట్లను అధిగమిస్తూ నిబ్బరం కోల్పోకుండా నిబద్ధతతో పనిచేస్తున్న నాయకుడు వైయస్‌ జగన్‌ అని చెప్పారు. నేటి రాజకీయ వ్యవస్థలో విలువలు, విశ్వసనీయతతో పనిచేసే ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌ ఒక్కరేనన్నారు. పార్టీ స్థాపించిన సమయంలో ఎంపీగా పోటీ చేసి అత్యథిక మెజార్టీతో గెలిచిన ఏకైక వ్యక్తి వైయస్‌ జగన్‌ అన్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన వారితో రాజీనామాలు చేయించి 17 సీట్లు గెలుచుకున్న దమ్మున్న నాయకుడన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మకై తప్పుడు కేసులు పెట్టించినా సంకల్ప సడలకుండా చిరునవ్వుతో వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాడన్నారు. 
తండ్రి బాటలోనే తనయుడి పయనం
ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పాదయాత్ర చేయడం దేశ చరిత్రలో రికార్డు అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.తండ్రి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలు, అన్న వైయస్‌ జగన్‌ కోసం వైయస్‌ షర్మిల 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిందన్నారు. ఒక మహిళ 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం రికార్డు అన్నారు. అదే విధంగా ప్రజా సంక్షేమం కోసం గతంలో మహానేత, నేడు జననేత పాదయాత్ర చేస్తున్నారన్నారు. మానవత్వం ఉంటే ప్రజలకు ఎంత మంచి చేయొచ్చో వైయస్‌ఆర్‌ చేసి చూపించారని, అదే బాటలో వైయస్‌ జగన్‌ నడుస్తూ రాజకీయం అంటే స్వచ్ఛత, విశ్వసనీయత, నిబద్ధత, విలువలు పాటించడం అని నమ్మారన్నారు. 
Back to Top