'సహకారంలో వైయస్ఆర్ సీపీదే విజయం'

నెల్లూరు జిల్లా:

త్వరలో జరగనున్న సహకార సంఘాల ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థులు విజయం సాధిస్తారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. రైతుల అభ్యున్నతి దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగిందన్నారు. ప్రస్తుతం విద్యుత్ కోతలతో ఎంతోమంది రైతులు పండించిన పంటలు ఎండిపోయి కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు.
     ప్రతి రైతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాడని చంద్రశేఖరరెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపిస్తారన్నారు. ప్రస్తుత సొసైటీ ఎన్నికలు కాంగ్రెస్‌పార్టీ సంస్థాగత ఎన్నికల్లానే ఉన్నాయి తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలేదన్నారు. అలాగే కొన్నిచోట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చే అభ్యర్థులు గెలిచే అవకాశమున్నందున స్టే తెచ్చుకోవడం పనికిమాలిన చర్యని ఆయన అన్నారు. చాలాచోట్ల కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి ఉమ్మడి అభ్యర్థిని పోటీలో పెట్టాయన్నారు.

వైయస్ఆర్ కాంగ్రెస్‌కే ప్రజల మద్దతు

     పశ్చిమగోదావరి జిల్లా: సంక్షేమ, అభివృద్ధి పథకాలతో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, ప్రజలంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని పార్టీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు అన్నారు. జిల్లాలోని శివారు వంకాయలపాలెంలో టీడీపీ నాయకుడు, ఏకగ్రీవంగా సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైన కూనిశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 200 మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సర్రాజు మాట్లాడుతూ మహానేత పాలనలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క ఆర్‌డబ్ల్యూఎస్ పథకానికే వంద కోట్లు కేటాయించారన్నారు. ఆకివీడులో 75 ఎకరాల భూమి వైయస్ఆర్ ఫౌండేషన్ కాలనీకి తీసుకొచ్చామని గుర్తుచేశారు.  ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ శేషుబాబు మాట్లాడుతూ సహకార ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగిస్తోందన్నారు. జిల్లాలో ఇప్పటికే 130 నుంచి 140 వరకు సొసైటీలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే కైవసం చేసుకున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుల వరకు పార్టీ అభ్యర్థులు గెలుపొందేలా కార్మికులు కృషిచేయాలని కోరారు.

వైయస్ఆర్ సీపీ గెలిస్తేనే రాజన్న రాజ్యం

     వరంగల్ జిల్లా: రైతే రాజుగా సాగిన రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే త్వరలో జరగనున్న సహకార ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మాజీ మంత్రి కొండా సురేఖ కోరారు. రైతుల కోసం నిరంతరం శ్రమించిన మహానేత పాలన మళ్లీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహనరెడ్డితోనే సాధ్యమన్నారు. 2014లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. శ్రీ జగన్మోహనరెడ్డి సీఎం కా వడం ఖాయమన్నారు.

Back to Top