‘నీరు–చెట్టు’ పేరుతో భారీ దోపిడీ

వెంకటాచలం: సర్వేపల్లి నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం పేరుతో టీడీపీ నాయకులు భారీ దోపిడీకి పాల్పడ్డారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. అవినీతి, అక్రమ గ్రావెల్‌ దోపిడీకి పాల్పడుతున్న టీడీపీ నాయకులను వదిలే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. వెంకటాచలంలోని ఎంపీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వెంకటాచలం మండలంలో  అధికార పార్టీని అడ్డం పెట్టుకుని బరితెగించి  అక్రమ గ్రావెల్‌ తవ్వకాలకు టీడీపీ నాయకులు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎవరైతే గ్రావెల్‌ దోపిడికి పాల్పడుతున్నారో వారే ఇతర పార్టీలకు చెందిన నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడం సిగ్గుచేటన్నారు. గత నెలలో సర్వేపల్లిలోని రొంటగుంట చెరువులో నీరు–చెట్టు మాటున అధికార పార్టీ నేత గ్రావెల్‌ తవ్వి ముత్తుకూరు మండలంలోని బ్రహ్మదేవికి, పొట్టింపాడు గ్రామానికి తరలించి సొమ్ము చేసుకున్న విషయం అధికారులకు తెలిసిందేనన్నారు. అయితే ఆ వ్యక్తి అక్రమాలపై సర్వేపల్లిలో ఇన్‌చార్జిగా ఉన్న వ్యక్తులు మాట్లాడకపోవడంతో గ్రావెల్‌ దోపిడీని ప్రోత్సహిస్తున్నట్లేననే విషయం అర్థమవుతుందన్నారు. అక్రమ గ్రావెల్‌ తరలింపుపై పత్రికల్లో వరుస కథనాలు వచ్చినా స్పందించక పోవడంతో ప్రజలుకు ఇట్టే అర్థమైపోయిందన్నారు. ఇన్‌చార్జిలుగా ఉన్న వ్యక్తులకు నీతి, నిజాయితీ దమ్ము ధైర్యం ఉంటే గ్రావెల్‌ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు సర్వేపల్లిలో అక్రమ గ్రావెల్‌ తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో వైయస్‌ఆర్‌సీపీ అవినీతికి పాల్పడుతుందని తప్పుడు ప్రచారాన్ని టీడీపీ చేయడంలో అర్థం లేదన్నారు. ఈ కేంద్రాలు ప్రారంభ సమయంలో వైయస్‌ఆర్‌సీపీ పార్టీనే లేదనే విషయాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు. జెండాలతో నిరసనలు చేపట్టి మధ్యలో మౌనంగా ఉండిపోయిన వ్యక్తులు ఎవరనే విషయం జిల్లా ప్రజలందరికీ తెలుసునన్నారు. సమావేశంలో ఎంపీపీ తలపల అరుణ, జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్య, మండల ఉపాధ్యక్షులు శ్రీధర్‌నాయుడు, జిల్లా కోఆప్షన్‌సభ్యులు అక్భర్‌భాష, వైఎస్‌ఆర్‌సీపి రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి కోడూరు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు కె.చెంచుకృష్ణయ్య, పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షులు ఈపూరు రజనీకాంత్‌రెడ్డి, పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శులు వెలిబోయిన వెంకటేశ్వర్లు, ఖయ్యూంఖాన్‌ పాల్గొన్నారు.

Back to Top