న్యూఢిల్లీ, 11 డిసెంబర్ 2013:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా జరుగుతున్నదని ప్రముఖ పారిశ్రామికవేత్త, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆయన బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రాల హక్కులను హరించారంటూ రఘురామ కృష్ణంరాజు తన పిటిషన్లో పేర్కొన్నారు. ఉమ్మడి రాజధాని అంశం రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదని, 371 (డి) రెండు రాష్ట్రాలకు ఎలా అమలు చేస్తారని ఆయన ఆ పిటిషన్లో కేంద్రాన్ని ప్రశ్నించారు.
'వైయస్ జగన్ ఆదేశాల మేరకే పిటిషన్' :
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకే తాను రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు రఘురామ కృష్ణంరాజు చెప్పారు. కేంద్రం కేబినెట్ ఆమోదించిన తెలంగాణ బిల్లులో అనేక అంశాలు రాజ్యాంగ విరుద్ధమైనవని తెలిపారు. రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటోందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి)లో మార్పులు చేయాలంటే సగం రాష్ట్రాలు ఆమోదించాలని చెప్పారు. పోలవరం డిజైన్‌ను మార్చడం హేతుబద్ధం కాదన్నారు.