రాజన్న రాజ్యంలో అంతా మంచి జరుగుతుంది

సత్తుపల్లి, 11 మే 2013:

ఫీజులు కట్టలేక పేద విద్యార్థులు చదువులు మానేస్తున్నారని శ్రీమతి వైయస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్  ప్రవేశపెట్టిన పథకాలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. రాజన్న రాజ్యం వచ్చే వరకు ఓపిక పడితే అంతా మంచి జరుగుతుందని ఆమె భరోసా ఇచ్చారు. ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికీ, దానితో అంటకాగుతున్న చంద్రబాబు తీరుకూ నిరసనగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో సాగింది. పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామంలో రచ్చబండ నిర్వహించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

‘వైయస్ఆర్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కింది. పేదరికం పోవాలంటే ప్రతి ఒక్కరూ పెద్ద చదువులు చదవాలనే గొప్ప ఆశయంతో వైఎస్సార్ తెచ్చిన ఫీజు రీయింబర్సుమెంటు పథకానికి ఈ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. విద్యార్థులకు పాతిక శాతమిస్తాం... ముప్పాతిక శాతమిస్తాం అంటూ ఫీజులు భిక్షం వేసినట్లుగా వేస్తోంది. ఫీజులు కట్టలేక విద్యార్థులు చదువులు మానేసే రోజులు మళ్లీ వచ్చాయి’ అని శ్రీమతి షర్మిల చెప్పారు. కొద్దిగా ఓపిక పట్టండి, త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది. అంత వరకు మీ చదువులు ఆపొద్దని ఆమె విద్యార్థులకు సూచించారు. రచ్చబండలో చిన్నారి అనే విద్యార్థిని మాట్లాడుతూ.. మహానేత ఉన్నప్పుడు ఒక్క రూపాయి లేకుండానే డిగ్రీ పూర్తి చేశాననీ,  ఇప్పుడు ఎమ్మెస్సీ జువాలజీ చదువుతున్నాననీ,  ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఫీజు అందలేదని చెప్పడంతో ఆమె స్పందించారు.

సమస్యలు తెలిపిన మహిళలు
శ్రీమతి షర్మిల యాత్రలో సాగుతుండగా దారి వెంట పలువురు మహిళలు కలిసి ఆమెకు తమ సమస్యలు వివరించారు. ‘అమ్మా..! వడ్డీ లేని రుణాలు అందడం లేదని మీరు బాధపడుతున్నారు. పల్లెల్లో ఏ మహిళను అడిగినా కూడా అసలు మాకు రూణాలే అందటం లేదని చెప్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రేమో వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తున్నామని రూ. కోట్లు ఖర్చు చేసి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఈ ముఖ్యమంత్రి వడ్డీలేని రుణాలు ఎవరికిస్తున్నట్లు?’ అని విమర్శించారు. ‘అమ్మా... అక్కా... సమయం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్, టీడీపీలకు గట్టిగా బుద్ధిచెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకానికీ జీవం పోస్తార’ని షర్మిల వారికి ధైర్యం చెబుతూ ముందుకు కదిలారు.

రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి..
మార్గమధ్యంలో తనను కలిసి సమస్యలు చెప్పుకొన్న రైతులు, కూలీలతో శ్రీమతి షర్మిల మాట్లాడుతూ.. ‘రాబోయే రాజన్న రాజ్యంలో అన్ని వర్గాల వారికీ జగనన్న మేలు చేస్తారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభించేటట్టు, అవసరమైతే ప్రభుత్వమే పంట కొనుగోలు చేసేటట్టు రూ. 3 వేల కోట్లతో జగనన్న ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. మన విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తారన్నారు. పేదల కోసం ఆరోగ్యశ్రీని నిలబెడతారని చెప్పారు. వృద్ధులకు, వితంతువులకు పింఛను రూ. 700 చేస్తారన్నారు. వికలాంగులకైతే రూ. 1,000 ఇస్తారని తెలిపారు. పిల్లలను పనికి కాకుండా బడికి పంపేలా తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ‘అమ్మ ఒడి’ పథకం ప్రవేశపెడతారని చెప్పారు. చిన్నారికి రూ. 500 చొప్పున పదో తరగతి వరకు తల్లి ఖాతాలో డబ్బులు వేస్తారన్నారు. ఇలా కుటుంబానికి ఇద్దరేసి పిల్లలకు పథకం వర్తింపజేస్తారని చెప్పారు. ఇంటర్ చదివితే రూ. 700 చొప్పున, డిగ్రీ చదివితే రూ. 1,000 చొప్పున అమ్మ అకౌంట్లోనే పడతాయని వివరించారు. అంతకంటే పెద్ద చదువులు చదివే వారికి ఫీజు రీయింబర్సుమెంటు పథకం ఉండనే ఉందని శ్రీమతి షర్మిల ధైర్యం చెప్పారు.

Back to Top