ఐటీడీఏ కుంభకోణాలపై నిగ్గు తేల్చాలి

శ్రీకాకుళం(సీతంపేట): ఐటీడీఏలో జరుగుతున్న కుంభకోణాలపై విచారణ జరగడం లేదని పాలకొండ ఎమ్మెల్యే కళావతి ఆందోళన వ్యక్తం చేశారు.  ఉద్యానవనాల్లో ఎరువుల కుంభకోణంపై విజిలెన్స్‌ దర్యాప్తు నీరుగారిపోయిందన్నారు. రూ.2.20 కోట్ల ఎరువుల కొనుగోలుకు సంబంధించి రూ.90 లక్షల అక్రమ చెల్లింపులు జరిగాయని పాలకవర్గ సమావేశంలో తాను నిలదీసినట్లు కళావతి తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి నివేదికలు అందించినా విచారణ సక్రమంగా చేయించలేదని కళావతి ఆవేదన వ్యక్తం చేశారు. వైటీసీకి సరఫరా చేసిన మెటీరియల్‌లో కూడా నాసికంగా ఉందని, దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. 

ఐటీడీఏ ద్వారా ఆశ్రమపాఠశాలలు, వసతి గృహాలకు సరఫరా చేస్తున్న పప్పులు, ఇతర నిత్యావసర సరుకుల టెండర్లలో కూడా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. అధికారులకు నచ్చిన వారికి టెండర్లను కట్టబెడుతున్నారని తెలిపారు. గతంలో హౌసింగ్‌ బిల్లుల చెల్లింపుల్లో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయని, కోట్లాది రూపాయలు బిల్లులు రూపేణా డ్రా చేసి గిరిజనులకు చెల్లించకుండా అక్రమార్కులు తినేశారని, దీనిపై కూడా విచారణ నామమాత్రంగానే సాగిందని తెలిపారు. కలెక్టర్‌ ఈ విషయంలో చొరవ చూపి ఐటీడీఏ కుంభకోణాలపై నిగ్గు తేల్చాలని కోరారు.
Back to Top