రాష్ట్రపతి మంచి ఆలోచన చేస్తారని ఆశిస్తా

న్యూఢిల్లీ‌, 23 నవంబర్ 2013:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి భవన్‌లో శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతిని కలుసుకున్నారు. సమైక్యాంధ్ర విషయంలో తాము చెప్పిన అంశాలను రాష్ట్రపతి సావధానంగా విన్నారని శ్రీ జగన్‌ తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయం, తాజా పరిణామాలపై రాష్ట్రపతికి సవివరమైన నివేదిక అందజేసి, విభజన జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 5 పేజీల నివేదికను ప్రణబ్‌కు ఈ సందర్భంగా అందజేశారు.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్రం అడ్డగోలుగా విభజించాలని చూస్తోందని రాష్ట్రపతి ప్రణబ్‌కు చెప్పామని సమావేశం అనంతరం శ్రీ జగన్‌ మీడియాకు తెలిపారు. మొదటి ఎస్సార్సీ తరువాత ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రాలను 60 ఏళ్ల తర్వాత ఇలా విభజించడం సరికాదని వివరించామని వైయస్ జగ‌న్ చెప్పారు. రాజ్యాంగంలోని 3వ అధికరణను సవరించాల్సిన ఆవస్యకత గురించి కూడా ఆయనకు చెప్పామన్నారు. ఆంధ్రప్రదేశ్ రా‌ష్ట్రాన్ని అడ్డగోలుగు విభజిస్తున్న విధానం ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లే ప్రమాద‌ం ఉందని రాష్ట్రపతికి వివరించామన్నారు. ఓట్లు, సీట్ల కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఏ రాష్ట్రాన్నయినా అడ్డగోలుగా విభజించేస్తారని ఆందోళన వ్యక్తంచేశామన్నారు. విభజనకు ఒక విధానాన్ని తీసుకురావాలని కోరామన్నారు.

విభజన కారణంగా రాష్ట్రంలో నీటి సమస్యలు మరీ ముఖ్యంగా తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి వస్తుందని ప్రణబ్‌కు చెప్పామని ఆయన అన్నారు. ఆర్టికల్‌ 371(డి) గురించి కూడా ప్రణబ్‌కు వివరించామని, తమ విజ్ఞప్తికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రపతి దృష్టికి తాము తీసుకువెళ్ళిన అంశాలన్నింటిపైనా ఆలోచిస్తానని చెప్పారన్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మంచి ఆలోచనతో ముందుకు వస్తారని తాను ఆశిస్తున్నానన్నారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ ప్రతినిధి బృందం.. అడ్డగోలు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు కృషిచేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులను‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బృందం కలుసుకున్నది. ఆంధ్రప్రదేశ్ విభజన ముసాయిదా బిల్లు కేంద్ర కేబినె‌ట్ ముందుకు వస్తుందని చె‌బుతున్న నేపథ్యంలో మరోసారి రాష్ట్రపతిని కలిసి విభజన ప్రక్రియలో జోక్యం చేసుకుని అడ్డుకోవాలని కోరారు.

Back to Top