ప్రణాళిక లేకే విద్యుత్తు సంక్షోభం: షర్మిల

మహబూబ్‌నగర్:

'ఏ ప్రాజెక్టు నుంచి, ఏ కాలంలో ఎంత విద్యుత్తు ఉత్పత్తవుతుందో మహానేత వేళ్ళ మీద లెక్కించి చెప్పేవారు.. ఇప్పటి పాలకులకు కనీసం ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉండో కూడా తెలీదు.. కిరణ్‌కుమార్‌కు తన పదవిని కాపాడుకోవడానికే సమయం సరిపోతోంద'ని  రాజన్న తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైయస్ షర్మిల తెలిపారు. ప్రజల్ని పట్టించుకోని ప్రభుత్వంపై అవిశ్వాసం ఎప్పుడు పెడతారంటూ ఆమె చంద్రబాబును నిలదీశారు. షర్మిల ప్రజాప్రస్థానం శుక్రవారం ముగిసేనాటికి ముపై ఏడు రోజులు పూర్తయ్యింది. ఇంతవరకూ 493 కిలోమీటర్లు నడిచారు.
     ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం ఏర్పడిందని ఆమె ద్వజమెత్తారు. పక్క రాష్ట్రాల్లో కూడా సంక్షోభం ఉన్నప్పటికీ ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి, విద్యుత్తు కొనుగోలు చేసి సమస్యను అధిగమించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ముఖ్యమంత్రి తన సీటును పదిలపరుచుకునే పనిలో పడి ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా కలుగొట్ల గ్రామానికి చెందిన శనగ రైతులు లక్ష్మీకాంతరెడ్డి, జమ్మన్న, ఆంజనేయులు, జాన్ పాషా షర్మిలను కలిశారు. ‘వేళాపాళా లేని కరెంటు కోతలతో పంటలు పూర్తిగా ఎండిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు గంటల కరెంటును నాలుగుసార్లు ఇస్తున్నారన్నారు. బోర్ల లోంచి నీళ్లు కాల్వకు మల్లేసరికి కరెంటు పోతోందనీ, తోటకు నీళ్లు పారక  ఎండిపోయిందనీ చెప్పడంతో షర్మిల పై విధంగా స్పందించారు.

వైయస్ వేళ్ల మీద లెక్కేసి చెప్పేవారు

     దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడు ఏ ప్రాంతానికి ఎంత విద్యుత్తు అవసరమో, ఏ జల విద్యుత్తు ప్రాజెక్టు నుంచి, ఏ కాలంలో ఎంత విద్యుత్తు ఉత్పత్తి అవుతుందో, ఇంకా ఎంత అవసరమవుతుందో వేళ్ల మీద లెక్క వేసి చెప్పేవారని షర్మిల గుర్తుచేశారు. ఇప్పటి పాలకులకు అసలు ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలియదని ఘాటుగా విమర్శించారు. ‘వైయస్ఆర్ బతికున్నప్పుడు తుంగభద్ర నది నుంచి ఆర్‌డీఎస్(రాజోలి డైవర్షన్ స్కీం)కు నీళ్లు వచ్చేవి. జల సమస్య ఉంటే నాన్నగారు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి వారిపై ఒత్తిడి తెచ్చి అవసరమైతే పోలీసు బలగాలను పెట్టి రాజోలి బండకు నీళ్లు తెచ్చేవారు. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత ఈ ప్రాజెక్టును పట్టించుకునే వాళ్లే కరువవడంతో ఈ ప్రాంత పంటలకు నీళ్లు రాకుండా పోయాయి’ అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలు పట్టని ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా ఇంకా ఎంతకాలం సాగదీస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆమె ప్రశ్నించారు.

Back to Top