ప్రధాని శాఖలోనే పెద్ద కుంభకోణం

చంద్రుగొండ (ఖమ్మం జిల్లా), 7 మే 2013: ప్రధానమంత్రి స్వయంగా నిర్వహిస్తున్న బొగ్గు శాఖలో సుమారు రూ. 2 లక్షల కోట్ల కుంభకోణం జరిగిన వైనాన్ని కాగ్‌ బయటపెట్టిందని శ్రీమతి షర్మిల తెలిపారు. బొగ్గు క్షేత్రాలకు వేలం వేయకుండా ప్రైవేటు సంస్థలకు కేటాయించడం వల్ల మన దేశానికి అంత నష్టం వాటిల్లిందని ఆమె విచారం వ్యక్తంచేశారు. కోల్‌గేట్‌ కుంభకోణంపై విచారణ చేసి నివేదిక ఇవ్వమని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశిస్తే.. అది విచారణ చేసి 'దొంగ చేతికే తాళం ఇచ్చినట్టు' ఆ రిపోర్టును ప్రధాన మంత్రి కార్యాలయంలోని న్యాయశాఖ మంత్రి ఆఫీసుకు, అటార్నీ జనరల్‌కు చూపించిందట. ఆ నివేదికలో వాళ్ళకు అనుకూలంగా మార్పులు చేశాక దాన్ని సుప్రీంకోర్టుకు సిబిఐ సమర్పించిందట అని శ్రీమతి షర్మిల ఆశ్చర్యం వ్యక్తంచేశారు. మరో ప్రజా ప్రస్తానం పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల మంగళవారం రాత్రి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని చంద్రుగొండలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.

కేంద్ర న్యాయశాఖ మంత్రి, సిబిఐ తీరు ఇలా ఉంటే.. రైల్వే మంత్రికి సంబంధించిన మనిషే లంచం తీసుకుంటూ దొరికిపోయిన వైనాన్ని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. మన దేశంలో కేంద్రం, మంత్రులు, సిబిఐ ఇలా పనిచేస్తుంటే.. చంద్రబాబు ఎందుకు నిలదీయడంలేదని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. ఆయనే కాదు టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలెవ్వరూ కాంగ్రెస్‌ మంత్రులను గాని, సిబిఐని గాని, కాంగ్రెస్‌ అధిష్టానాన్ని గాని నోరు విప్పి ఒక్క మాట విమర్శించడం లేదంటే.. వారి స్నేహం ఎంత దూరం వెళ్ళిందో అర్థమవుతోందన్నారు. సిబిఐ నుంచి తనను తాను రక్షించుకోవడానికే చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కాపాడారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. అవిశ్వాసానికి టిడిపి మద్దతు ఇచ్చి ఉంటే ఈ ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలిపోయి ఉండేదన్నారు.

దమ్మూ ధైర్యం ఉంటే ఎన్నికలకు రావాలని శ్రీమతి షర్మిల కాంగ్రెస్‌, టిడిపి పార్టీలను సవాల్‌ చేశారు. ఎన్నికలకు వెళితే ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో తేలిపోతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కూడా చిరంజీవి మాదిరిగానే టిడిపిని కాంగ్రెస్‌కు రాసి ఇచ్చేశారని ఎద్దేవా చేశారు. అందుకే టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్‌పై పల్లెత్తు మాట అనడంలేదన్నారు. వీళ్ళ స్నేహం ఇక్కడితో ఆగదన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టిడిపి ఏర్పాటైతే.. నిస్సిగ్గుగా అదే కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యిందని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలూ పొత్తులు పెట్టుకుంటాయని శ్రీమతి షర్మిల విమర్శించారు. ఈ విషయం తెలిసి ఉండి కూడా‌‌ దమ్ముంటే ఎన్నికలకు రావాలని కాంగ్రెస్‌, టిడిపిలకు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సవాల్‌ చేస్తోందన్నారు.

ఎన్నికలంటూ జరిగితే.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ విజయంతో అధికారంలోకి వస్తుందని, జగనన్న సిఎం అవుతారని వీళ్ళకు తెలుసు. అందుకే కాంగ్రెస్‌, టిడిపిలు ఇప్పట్లో ఎన్నికలకు రావని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తే..  ఓటు వేసే ప్రతి ఒక్కరూ శ్రీ జగన్మోహన్‌రెడ్డి నిర్దోషి అని నమ్ముతున్నామని ఎలుగెత్తి చాటుతారని వీళ్ళకు తెలుసన్నారు. ఎన్నికలొస్తే..‌ సిఎంగా కిరణ్ వద్దు, చంద్రబాబు వద్దు... జగన్మోహన్‌రెడ్డి కావాలని ప్రజలంతా ముక్తకంఠంతో చెబుతారని వీరికి తెలుసన్నారు. జగనన్న బయట ఉంటే కాంగ్రెస్‌, టిడిపిలకు మనుగడ ఉండదని, ఆ రెండు పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని వీరికి తెలుసు. అందుకే కుట్రలు పన్ని, అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను జైలుపాలు చేశారని దుయ్యబట్టారు. కానీ బోనులో ఉన్నా.. సింహం సింహమే అన్నారు. మంచివాళ్ళకు అండగా దేవుడుంటాడన్నారు. ఉదయించే సూర్యుడిని ఆపలేనట్లే జగనన్ననూ ఎవరూ ఆపలేరని శ్రీమతి షర్మిల ధీమాగా చెప్పారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తారని, బెయిల్‌ ఇవ్వవద్దంటూ సిబిఐ న్యాయవాది సుప్రీంకోర్టులో వాదించడాన్ని శ్రీమతి షర్మిల తీవ్రంగా ఖండించారు. సాక్షులను‌ శ్రీ జగన్ ప్రభావితం చేస్తారని మీరు రుజువు చేయగలరా అని సుప్రీంకోర్టు అడిగితే సిబిఐ సమాధానం చెప్పలేకపోయిందన్నారు. సిబిఐ కేంద్రం చేతిలోనే ఉండాలని, అది చెప్పిందే చేయాలని ఆ సంస్థ మాజీ డైరెక్టర్‌ జోగిందర్‌ సింగ్‌ చెప్పిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. కాంగ్రెస్‌ను వ్యతిరేకించడం అంత సులభం కాదని‌ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న యుపి మాజీ సిఎం ములాయం సింగ్‌ యాదవ్‌ అన్న మాటలను ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తే వెయ్యి తలలతో కాటేస్తుందని, సిబిఐని ఉసిగొల్పుతుంది, జైలులో పెట్టిస్తుందని ఆయన అన్నారన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటే.. ఈపాటికి ఏ మంత్రో, ముఖ్యమంత్రో అయి ఉండేవారన్న గులాం నబీ ఆజాద్ మాటలను గుర్తుచేశారు. కాంగ్రెస్‌ను వ్యతిరేకించినందువల్లే‌ శ్రీ జగన్ అష్టకష్టాలు పడుతున్నారని కాంగ్రెస్‌ నాయకుడే అన్నారంటే.. వాళ్ళ దురుద్దేశం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చాన్నారు.

చంద్రబాబుకు అతితెలివి చాలా ఉంది కనుక చీకట్లోనే చిదంబరాన్ని కలిసి తన మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరగకుండా చేసుకున్నారని శ్రీమతి షర్మిల విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కుమ్మక్కై అది కూలిపోకుండా కాపాడారు కనుకే సిబిఐ చంద్రబాబు జోలికి వెళ్ళదని వ్యాఖ్యానించారు. జగనన్న దోషి అని ఏ కోర్టూ చెప్పలేదన్నారు. చంద్రబాబు నిర్దోషి అని, ఆయన అవినీతిపరుడు కాదని, బొత్స సత్యనారాయణ మద్యం మాఫియా డాన్‌ కాదని, ఆయన ఉత్తముడని ఏ కోర్టూ నిర్ణయం చెప్పలేదన్నారు. చిరంజీవి బంధువుల ఇంటిలో దొరికిన రూ. 70 కోట్లు దొరికితే సిబిఐకి కనిపించదన్నారు. వీరంతా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారు కనుకే వారి మీద ఏ కేసులూ లేవన్నారు. జగనన్న కాంగ్రెస్‌ను వ్యతిరేకించారు కనుకే ఆయనపై అబద్ధపు కేసులు పెట్టి, విచారణ పేరుతో 11 నెలలుగా జైలులో నిర్బంధించారని ఆవేదన వ్యక్తంచేశారు.

జగనన్న త్వరలోనే బయటికి వస్తారని, రాజన్న రాజ్యం వైపు మనందరినీ నడిపిస్తారని శ్రీమతి షర్మిల భరోసాగా చెప్పారు. అధికారంలోకి వచ్చాక జగనన్న రైతులు, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తారన్నారు. అమ్మ ఒడి పథకం పెట్టి విద్యార్థుల తల్లుల ఖాతాలోనే డబ్బులు వేస్తారన్నారు. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ. 700, వికలాంగులకు వెయ్యి రూపాయల పింఛన్‌ ఇస్తారని హామీ ఇచ్చారు. చెప్పినవీ, చెప్పనివీ చేసిన రాజన్న మార్గంలోనే జగనన్న కూడా అందరికీ మేళ్ళు చేస్తారన్నారు. జగనన్న సిఎం అయ్యాక గ్రామాల్లో బెల్టుషాపులను రద్దు చేస్తారన్నారు. అంతవరకూ జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా ఉండాలని శ్రీమతి షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తాజా వీడియోలు

Back to Top