ప్రభుత్వం ‘కరెంట్’ డ్రామా

వైయస్‌ఆర్‌‌ కాంగ్రెస్ నేత ప్రసాదరాజు

నరసాపురం, 28 ఆగస్టు 2012 : ప్రజల ఓట్ల కోసమే ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసి కరెంట్‌ డ్రామా ఆడిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు దుయ్యబట్టారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యక్తలు, యువకులు సోమవారం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. కార్యక్రమంలో పాల్గొన్న ముదునూరి ప్రసాదరాజు పోలింగ్‌ అయిన మరుసటి రోజు నుంచే విద్యుత్‌ కోతలు ప్రారంభించి ప్రభుత్వం ప్రజలను వంచించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్‌ సరాఫరా చేసిందన్నారు. అయితే, వర్షాకాలం వచ్చిన తరువాత విద్యుత్‌ కోతలు విధించటమేమిటని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికల సమయంలోనే ప్రజల అవసరం ఈ ప్రభుత్వానికి ఉంటుంది కానీ అనంతరం ఉండదా అని ప్రసాదరాజు నిలదీశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యు‌త్‌ అందించినా, ప్రజలపై ఎలాంటి భారం వేయలేదని ప్రసాదరాజు గుర్తుచేశారు. మహానేత భిక్షతో నడుస్తున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తూ రైతులు, ప్రజలను వంచిస్తోందన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా కన్వీన‌ర్ కావలి వెంకటరత్నంనాయుడు, చేనేత విభాగం జిల్లా కన్వీనర్ డీఎస్ఎ‌స్ ప్రసాదరావు, ఎస్సీ సె‌ల్ జిల్లా కన్వీన‌ర్ వంగలపూడి యేషయ్య, నియోజకవర్గ‌ం నాయకులు మైలా వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

 

Back to Top