ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డూ ఇవ్వలేదు

వెంకట్రామన్న గూడెం, 21 మే 2013:

వెంకట్రామన్నగూడెంలో శ్రీమతి షర్మిల సోమవారం సాయంత్రం రచ్చబండ నిర్వహించారు.  ప్రజల సమస్యలు విన్న అనంతరం ఆమె మాట్లాడుతూ ‘‘ఈ ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఒక్క కొత్త పక్కా ఇల్లు కూడా కట్టించలేదు. ఆరోగ్యశ్రీ కార్డులను చెత్తబుట్టలో వేసుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆ పని చేయకుండా తన భుజస్కంధాలపై మోస్తోంది’ అని విమర్శించారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్, టీడీపీలకు గట్టిగా బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.

12.4 కిలోమీటర్ల పాదయాత్ర
‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 154వ రోజు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో ప్రారంభమైంది. అక్కడి నుంచి షర్మిల నడచుకుంటూ ప్రకాశరావుపాలెం చేరుకుని పోలవరం కుడి కాలువను పరిశీలించారు. నర్సాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కాలువకు సంబంధించిన అంశాలను ఆమెకు వివరించారు. తర్వాత షర్మిల తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని వెంకట్రామన్నగూడేనికి చేరుకుని అక్కడ ఉద్యాన వర్సిటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. సాయంత్రం ఇదే ఊళ్లో రచ్చబండ నిర్వహించారు. అక్కడి నుంచి సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.35 నిమిషాలకు షర్మిల చేరుకున్నారు. సోమవారం మొత్తం 12.4 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్రలో పార్టీ నేతలు మైసూరారెడ్డి, చేగొండి హరిరామ జోగయ్య, ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, తానేటి వనిత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు చెరకువాడ శ్రీరంగనాథరాజు, ముదునూరి ప్రసాదరాజు, చిర్ల జగ్గిరెడ్డి, స్థానిక నాయకులు తలారి వెంకట్రావు, డి.సువర్ణరాజు, తోట గోపి పాల్గొన్నారు.

Back to Top