పోరాటం కొనసాగిస్తాం: విజయమ్మ

హైదరాబాద్, 28 మే 2013:

భారత రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్, ‌టిడిపి, సిబిఐ కుట్రలు చేస్తున్నాయని పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆరోపించారు. ద్వంద్వ నీతితో ‌సిబిఐ విచారణ చేస్తోందని ఆమె ఆరోపించారు. శ్రీ జగన్ అక్రమ నిర్బంధానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని శ్రీమతి విజయమ్మ ప్రకటించారు. సోమ, మంగళవారాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొని తమకు అండగా నిలిచిన వారందరికీ ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మంగళవారం నిరసన దీక్ష చేసిన శ్రీమతి విజయమ్మ సాయంత్రం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

కాంగ్రెస్‌ పార్టీకి 35 ఏళ్ళ పాటు సేవ చేసిన మహానేతను ఎఫ్‌‌ఐఆర్‌లో దోషిగా పెట్టడమేమిటని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. కేసులు, సిబిఐ వేధింపులు, జైలు నిర్బంధాలేనా ఆ మహనీయుని కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చే బహుమతి అని నిలదీశారు. జగన్‌బాబుకు బెయిల్‌ కూడా రానివ్వకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జగన్‌బాబు లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ చంద్రబాబు గోబెల్సు ప్రచారం చేస్తున్నారని, ఆ లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో ఆయన వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తన దగ్గర ఉన్నది పంచడమే గాని దాచుకోవడం, దోచుకోవడం డాక్టర్‌ వైయస్ఆర్‌కు తెలియదన్నారు.

అరబిందో, హెటిరో డ్రగ్సుకు రూ. 16 కోట్లు లబ్ధి చేకూరిస్తే రూ. 32 కోట్లు ఎందుకు పెట్టుబడిగా పెడతారనడంలో ఔచిత్యం ఉందా? అని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. ఈనాడుకు రూ. 2,600 కోట్లు వస్తే వాటాదారులకు ‌ఒక్క పైసా కూడా డివిండ్ ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలని, సంతోషంగా ఉండాలనే మహానేత వైయస్‌ నిరంతరం ఆలోచించారు కానీ ఏ తప్పూ చేయలేదన్నారు. ఒక వైపున సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరో పక్కన రైతులకు జలయజ్ఞాన్ని అందించారన్నారు. సాక్షిలోకి వచ్చిన పెట్టుబడులు ఏమైనా జగన్‌బాబు జేబులోకి వచ్చాయా? అని ఆమె ప్రశ్నించారు. సాక్షిలో పెట్టుబడులు దానిలోనే ఉన్నాయన్నారు.

సిబిఐ దర్యాప్తును ఎలా నమ్మాలో అర్థంకాని పరిస్థితి ఉందని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. కోల్‌గేట్‌ కుంభకోణంలో సిబిఐ దర్యాప్తు నివేదికను ప్రభుత్వం మార్చివేసిన వైనాన్ని ఆమె ప్రస్తావించారు. జగన్‌బాబుపై చేసిన ఆరోపణల్లో ఒక్కదాన్ని కూడా నిరూపించలేకపోయారన్నారు.
అవినీతి, కళంకిత మంత్రులు అన్నందుకే బాధపడుతున్నారని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. తమపై వచ్చినవి ఆరోపణలేనని, నేరం రుజువు కాలేదని మంత్రులు చెబుతున్నారని... శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై కూడా వచ్చినవి ఆరోపణలే అని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. జగన్‌బాబు దోషి అని ఏ కోర్టు నిర్ధారించిందని ఆమె ప్రశ్నించారు. జగన్‌బాబును ఏడాది కాలంగా ఎందుకు జైల్లో ఉంచారని ఆమె సూటిగా ప్రశ్నించారు. గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి.. జగన్‌బాబు ఎన్నడైనా మీ కార్యాలయాలకు వచ్చిగానీ, క్యాంప్ ఆఫీసుకు వచ్చిగాని కనపడ్డాడా అని శ్రీమతి విజయమ్మ నిలదీశారు. జగన్‌బాబు స్వార్థం కోసం మంత్రులు బలవుతున్నారంటూ చేస్తున్న ఆరోపణలు విన్నప్పుడు చాలా బాధగా ఉంటోందన్నారు. జగన్‌బాబు ఆర్థిక ఉగ్రవాది అని, ఉరివేయాలని, దేశం నుంచే ఆయన కుటుంబాన్ని వెలివేయాలంటూ కొందరు మంత్రులు బరితెగించి మాట్లాడుతున్నారని వారికి ఆ హక్కు ఎవరిచ్చారని శ్రీమతి విజయమ్మ నిలదీశారు. మహానేత వైయస్‌‌ఆర్ జగన్‌బాబును విలువలతో పెంచారన్నారు. తప్పు చేసే విధంగా తన కొడుకును వైయస్‌ఆర్‌ చేయలేదన్నారు.

కాంగ్రెస్ నుంచి బయ‌టికి వచ్చిన వారంలోనే శ్రీ జగన్‌కు ఐటీ నోటీసు‌లు వచ్చాయని ఆమె తెలిపారు. వివాదాస్పద 26 జిఓలు సక్రమమా కాదా అని ప్రభుత్వానికి నోటీసులు అందినప్పుడు కనీసం ఒక్క జిఓపైన కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. మంత్రులు కూడా వ్యక్తిగతంగా కౌంట‌ర్ దాఖలు చేయలేకపో‌యారన్నారు. ఆధారా‌లేవీ లేకుండానే శంకర్రావు పిటిషన్ వేస్తే.. ‌టిడిపి నాయకులు ఇంప్లీ‌డ్ అయ్యారన్నారు. శ్రీ జగన్‌పై జరిగిన కుట్రకు ఇవన్నీ ఉదాహరణలు అని శ్రీమతి విజయమ్మ అన్నారు.

జగన్‌బాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదనే నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఏడాదిగా జైల్లో ఉంచారని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. ఇందిరాగాంధీని చంపిన హంతకులను సైతం విచారించిన తర్వాతే కేసు నమోదు చేశారని, ఎలాంటి విచారణ లేకుండా మూడు ఛార్జిషీట్లలో ఏ 1 గా నిందితునిగా శ్రీ జగన్‌ను పేర్కొనడం కుట్ర కాక మరేమిటని ఆమె ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పులను కూడా సిబిఐ లెక్కచేయడంలేదని దుయ్యబట్టారు. మరణించినన మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ పేరును చార్జిషీ‌టులో పెట్టడం ఎంతవరకు న్యాయం అని ఆమె ప్రశ్నించారు.

అసమర్థ, ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విప్ జారీ‌చేసి మరీ కాపాడిన ఘనత ప్రతిపక్ష నేత చంద్రబాబుదే అని శ్రీమతి విజయమ్మ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎన్నికల ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నది చంద్రబాబే అన్నారు. నోట్ల కట్టలను బస్తాలలో, లారీలలో ఎలా నింపాలో చంద్రబాబుకు తెలిసినంతగా.. మరెవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుతున్నారు కాబట్టే చంద్రబాబుపై ఎటువంటి విచారణలు జరగడం లేదన్నారు.

త్వరలోనే జగన్‌బాబు బయటికి వస్తారని, ఆయన నాయకత్వంలో రాజన్న నాటి సువర్ణయుగాన్ని మళ్ళీ తెచ్చుకుందామని శ్రీమతి విజయమ్మ అన్నారు. మహానేత చేసినవి, జగన్‌బాబు హామీ ఇచ్చినవన్నీ నెరవేరుస్తారని సభా ముఖంగా ఆమె హామీ ఇచ్చారు.

Back to Top