పెట్టుబడికి పదిరెట్లు తక్కువ దిగుబడి

అనంతపురం:

అరవకూరు సమీపంలో ఎండిపోయిన ఓ వేరుశెనగ చేనును షర్మిల చూసి చలించిపోయారు. సంబంధిత రైతు  నారాయణను పలకరించారు. ఐదెకరాల్లో రూ. 50 వేల పెట్టుబడితో వేరుశనగ పంట వేశాననీ,  చెట్టుకు ఒకటో రెండో మాత్రమే కాయలు కాశాయనీ, ఇప్పటికే ఆకు ఎండి రాలిపోతోందనీ వాపోయారు. పంటకు మొత్తం రూ. 5 వేలకు మించి వచ్చే పరిస్థితి లేదనీ, చేను తెంపేందుకే ఇవి సరిపోవని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పంట ద్వారా రూ. 45 వేలు నష్టపోయినట్టేనని కన్నీటి పర్యంతమయ్యారు. నష్టపరిహారం కూడా వచ్చే అవకాశం లేదని తోటి రైతులు అంటున్నారనీ, వాతావరణ బీమా అంటూ ఎంత ప్రీమియం కడితే అంతే పరిహారం వస్తుందని చెబుతున్నారనీ ఆందోళన వ్యక్తంచేశారు. దీనికి షర్మిల స్పందిస్తూ ‘చంద్రబాబు ప్రభుత్వంలోనూ ఇదే జరిగింది. ఆయన మైండ్‌సెట్‌లోకే ప్రజలు రావాలన్నారు గానీ ఆయన మాత్రం ప్రజల అవసరాలను గుర్తించలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పరిహారం చెల్లించే ఉద్దేశం లేకనే ఇలా నడచుకుంటోంది. రాజన్న ఉన్నప్పుడు గ్రామం యూనిట్‌గా దాదాపు 95 శాతం వరకు పరిహారం ఇచ్చారు.. పెన్నా రిజర్వాయర్‌కు నీళ్లు తెచ్చి చెరువులు నింపి తద్వారా గ్రామాలకు సాగునీటి కొరతను తీర్చారు..’ అని గుర్తుచేశారు. ఉదయం 11.30కు అరవకూరు చేరుకోగానే మహిళలు షర్మిలకు స్వాగతం పలికి అక్కడే కూర్చుని తమ సమస్యలు విన్నవించారు.
రూ. 20 వేల కరెంటు బిల్లు:
తదనంతరం కూడేరు సమీపంలో గాంగ్యా నాయక్ అనే రైతుకు చెందిన చీనీ తోటను షర్మిల పరిశీలించారు. ఉచిత విద్యుత్తు అంటూనే రూ. 20 వేల కరెంటు బిల్లు కట్టాలని తనను వేధిస్తున్నారని నాయక్ షర్మిలకు చెప్పారు.  బుధవారం ఉదయం కూడా అధికారులు తన దగ్గరికి వచ్చారని వివరించారు. చీనీ(బత్తాయి)కి ధర లేదని, గిట్టుబాటు కావడం లేదని వాపోయారు. ఈ ప్రభుత్వానికి రైతులను దెబ్బతీసే చర్యలే తప్ప వారికి ప్రయోజనం కలిగించే చర్యలు చేపట్టడం లేదని షర్మిల అతడికి చెప్పారు. జగనన్న రాగానే పంటల గిట్టుబాటుకు రూ. 3 వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారని భరోసా ఇచ్చారు.

Back to Top