ప్రజల సంక్షేమం పట్టని సీఎం: అమరనాథరెడ్డి

చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ధ్వజమెత్తారు.  ఆయన రామసముద్రం మండలంలో ఓ ప్రయివేట్ కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  టీడీపీ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తున్నా ప్రజా సంక్షేమ పథకాలు అమలు కాలేదన్నారు. సంక్రాంతి, ఉగాది పండుగల పేరుతో ఇచ్చే సరుకులే సంక్షేమం అనుకుంటున్నారని విమర్శించారు. పడమటి ప్రాంతాల్లో ప్రజలు వరుస కరువుతో తాగునీటి, సాగునీరు లేక అలమటిస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. గుక్కెడు తాగు నీటి కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారని, రైతులు రీ బోర్లు వేయకూడదని అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, ప్రభుత్వం నుంచి అధికారులకేమైనా ఆదేశాలు వచ్చాయా? అని ప్రశ్నించారు. సాగు నీరు లేకపోవడంతో పంటలు పండక రైతులు పశువులపై ఆధారపడి జీవనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిగా నెరవేరిన దాఖలాలు లేవన్నారు. డ్వాక్రా మహిళలను రుణాలు చెల్లించవద్దని టీడీపీ నాయకులే ఎన్నికలకు ముందు చెప్పారని, ఆ రువాత మహిళలు రుణం వడ్డీతో సహా మంగళసూత్రాలు అమ్మి చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌జీ.మురళి, కౌన్సిలర్ ఖాజా, సర్పంచ్ కత్తి వాలెప్ప, నాయకులు భాస్కర్‌గౌడ్,  మహబూబ్‌బాషా, ప్రభాకర్, రెడ్డిశేఖర్ యాదవ్, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Back to Top