'పేదల జీవితాలంటే ఈ ప్రభుత్వానికి చులకన'

కర్నూలు : కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి పేదల జీవితాలంటే లక్ష్యం లేకుండా పోయిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.ఎం.ఎం. ఖాద్రి సాహెబ్‌ నిప్పులు చెరిగారు. మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి పాలనా కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ చక్కని అభివృద్ధి సాధించిందని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికీ సకాలంలో సక్రమంగా అందాయని తెలిపారు. మహానేత వైయస్‌ఆర్‌ రెక్కల కష్టంతో వచ్చిన అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ‌ం ఒక్క నిరుపేద కుటుంబాన్ని కూడా ఆదుకునే పరిస్థితి లేదన్నారు. సిఎం కిరణ్ కుమా‌ర్‌రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని, దీనితో ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందడం లేదని ఖాద్రి ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని వైయస్‌‌ఆర్‌సిపి నాయకుడు ఎజాజ్ నివాసంలో ఆదివారంనాడు పార్టీ మైనార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం ఖాద్రి విలేకరులతో మాట్లాడారు.

కాంగ్రెస్, ‌టిడిపి కుమ్మక్కు‌, కుట్ర రాజకీయాలతో వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని జైలు పాలు చేశాయని ఖాద్రి విమర్శించారు. ఆ పార్టీల ఆటలు ఇకపై సాగబోవని ఆయన హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అఖండ మెజార్టీతో గె‌లుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. జననేత శ్రీ జగన్‌కు మద్దతుగా రాష్ట్రంలోని అత్యధిక శాతం ప్రజలు ఉన్నారని అన్నారు. అప్పుడు శ్రీ జగన్ ‌సిఎం కాకుండా ఆపే శక్తి ఎవరికీ ఉండబోదన్నారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్ ‌కారణంగా కేంద్రం, రాష్ట్రంలో పదవులు అనుభవిస్తున్న నాయకులు ఇప్పుడు ఆయననే విస్మరించడం సహించరానిదని ఖాద్రి అన్నారు. మహానేతను విస్మిరించిన వారి తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Back to Top