'పేదల గుండెల్లో కొలువైన మహానేత రాజన్న'

చిన్నచింతకుంట (పాలమూరు జిల్లా): దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డికి ‌మరణమే లేదు.. ఆయన అమరుడు.. పేద ప్రజల గుండెల్లో ఉన్నంతకాలమూ ఆయన బతికి ఉన్నట్లేనని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్ సోదరి‌ శ్రీమతి షర్మిల అభివర్ణించారు. జగనన్నను ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేస్తే వైయస్ ప్రవేశపెట్టిన ప్రజా‌ సంక్షేమ పథకాలన్నీ మళ్ళీ సక్రమంగా అమలు చేస్తారని ఆమె హామీ ఇచ్చారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా శనివారం షర్మిల దేవరకద్ర మండలం అల్లిపురం నుంచి నెల్లికొండి వరకు పాదయాత్రలో నడిచారు.

‘బీడీ కార్మిలకు ఇబ్బందులను గుర్తించి‌న మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి‌ తన హయాంలో బీడీ కంపెనీల యాజమాన్యాలను ఒప్పించి రూ. 150లు చెల్లించే విధంగా జీఓ జారీచేసినా అమలయ్యేలోగా ఆయన మరణించడం దురదృష్టకరం’ అని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. చిన్నచింతకుంటలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె బీడీ కార్మికుల బాధలు విని పై విధంగా స్పందించారు. ఫీజు రీయింబర్సుమెంట్ పథకం సక్రమంగా అమలు చేయకపోవడంతో తాము మధ్యలోనే చదువు మానేశామని పలువురు విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు. సుచరిత అనే బాలిక మాట్లాడుతూ, పేదల పట్ల మహానేత వైయస్‌ జాలి చూపి, పథకాలు అమలు చేయడం వల్లే తన అన్న ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీలో ‌బిటె‌క్ చదువుతున్నాడని గుర్తుచేసింది. ఉపాధి హామీ పనులకు వెళ్తున్నా కూలి రూ.50 నుంచి రూ.60కు మించి రావడం లేదని కూలీలు మొరపెట్టుకున్నారు. కొద్ది రోజులు ఓపిక పట్టండని, ఇకపైన మంచి కాలం వస్తుందని, జగనన్న సారథ్యంలో రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని వారి శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. 

ప్రాజెక్టులను మరిచిపోయిన ప్రభుత్వం:
మహానేత వైయస్ ‌పాలనాకాలంలో మంజూరు చేసిన ప్రాజెక్టులను కూడా ప్రస్తుత ప్రభుత్వం పూర్తిచేయలేకపోయిందని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. దేవరకద్ర నియోజకవర్గంలోని మండలాలకు ఫేజ్-2 ద్వారా సాగునీరు అందించేందుకు, మక్త‌ల్‌లో భీమా మొదటి దశ పనులకు వైయస్ రూ. 2158 కోట్లు కేటాయించి రూ. 1740 కోట్లు ఖర్చు చేసి 85 శాతం పనులు పూర్తిచేశారని ఆమె వివరించారు. మిగిలిన 15 శాతం పనులు చేయకుండా ప్రస్తు ప్రభుత్వం మూడేళ్లుగా కాలయాపన చేస్తోందన్నారు. ప్రాజెక్టులు పూర్తిచేయకపోవడంతో ఈ ప్రాంతంలో పనులు లేక కూలీలు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారని, కుటుంబ జీవనం కోసం పాఠశాలలకు వెళ్లే పిల్లలను సైతం కూలికి తీసుకెళ్తున్నారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.

ఇది పేదలను కొట్టే రాబందుల రాజ్యం:
పెద్దవడ్లమానులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో శ్రీమతి షర్మిల మాట్లాడుతూ.. వైయస్ హయాంలో రూ.60 వచ్చే విద్యు‌త్ బిల్లులు ‌ఇప్పుడు రూ.300 నుంచి రూ.400 వరకు వస్తున్నాయన్నారు. అది కూడా ఈ ప్రభుత్వం రోజుకు నాలుగు గంటలకు మించి విద్యుత్‌ను సరఫరా చేయలేకపోతున్నదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను పీక్కుతినే రాబందుల రాజ్యంగా మారిందని తీవ్ర‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీమతి షర్మిల పాదయాత్ర వెంట మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారంతా మంగళ హారతులు పట్టి శ్రీమతి షర్మిలకు ఘనస్వాగతం పలికారు. మద్దూరు ప్రజల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. రచ్చబండలో స్థానిక మహిళలు చెప్పిన సమస్యలను శ్రీమతి షర్మిల శ్రద్ధగా విన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే ఏడాది పాటు ఓపికపట్టాలన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే సమస్యలు తీరిపోతాయని హామీ ఇచ్చారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top