పాదయాత్రలో 'వంద'లాది అబద్ధాలు

హైదరాబాద్:

వందరోజుల పాదయాత్రలో చంద్రబాబు వందలాది అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేశారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. వందరోజుల పాదయాత్రను సినిమా శతదినోత్సవ వేడుకలా చేసుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాదయాత్ర రికార్డుల కోసమే తప్ప ప్రజా సమస్యల కోసం కాదన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ పాదయాత్రకు, చంద్రబాబు యాత్రకు పోలికే లేదన్నారు. కాంగ్రెస్ నేత తాజాగా చేయించిన సర్వేలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 191 సీట్లు గెలుస్తుందని తేలడంతో బాబుకు మతి భ్రమించిందన్నారు. అంతకంటే ఎక్కువ సీట్లు వైఎస్‌ఆర్ సీపీ సాధిస్తుందని అంబటి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్ని వందల కిలోమీటర్లు నడిచినా పరాజయం తప్పదన్నారు. మతిభ్రమించి చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు.
      దివంగత మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డి 64 రోజులలో 1500 కిలోమీటర్లు నడిస్తే.. చంద్రబాబు అదే దూరాన్ని నడవడానికి వంద రోజులు తీసుకున్నారన్నారు. ఈ వంద రోజులూ చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పిన విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. విద్యుత్తు ఇలాగే ఇచ్చుకుంటూ పోతే కరెంటు తీగలు బట్టలారేసుకునేందుకు ఉపయోగపడతాయి అని అప్పుడే చెప్పానని చంద్రబాబు తెలిపారన్నారు. ఉచిత విద్యుత్తు ఇవ్వనని చెప్పడమే ఇదన్నారు. 1998లో విద్యార్థులందరికీ సైకిళ్ళు ఇస్తాననీ, ఉచితంగా చదివిస్తాననీ చెప్పారన్నారు. 2004వ సంవత్సరం వరకూ పాలించిన చంద్రబాబు ఒక్కరికైనా సైకిలు ఇచ్చారా.. ఒక్క విద్యార్థికైనా చదువు చెప్పారా అని అంబటి ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు ఇస్తాననీ, నిరుద్యోగులకు భృతి ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి ఉన్నపుడు అసలు ప్రభుత్వోద్యోగాలే దండగనీ, ఉన్న ఖాళీలను భర్తీ చేయవద్దనీ ఈ పెద్దమనిషి ఆదేశించారన్నారు. రాష్ట్రం ఓ కంపెనీలాంటిందనీ, నేను సీఈఓననీ తెలిపారన్నారు. ఇలాంటి వ్యక్తి మాట్లాడుతున్న మాటల్ని ఎలా నమ్మాలని అంబటి ప్రశ్నించారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటు ఇస్తానని చెబుతున్నారనీ, ఆయన హయాంలో కుమారుడు లోకేష్‌కు మాత్రం సత్యం రామలింగరాజు ద్వారా ఫీజు రీయింబర్సుమెంటు ఇప్పించుకున్నారనీ ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్సుమెంటు ప్రవేశపెట్టిన డాక్టర్ వైయస్ఆర్‌కే దక్కుతుందన్నారు.  

     ఆయనను దూషించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. డాక్టర్ రాజశేఖరరరెడ్డిగారు చేసిన తప్పు వల్ల విద్యుత్తు సంక్షోభం ఏర్పడిందని చెబుతున్నారు తప్ప.. ప్రస్తుత కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పు పట్టడం లేదన్నారు. విద్యుత్తు చార్జీలు పెంచితే ఆందోళనే చేయలేదన్నారు. కనీసం నిరసన కూడా తెలపలేదన్నారు. అలాంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖరరెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన రైతుల రుణాలు మాఫీ చేయడం కాదు కదా.. కనీసం వడ్డీ మాఫీ కూడా చేయాలేదని అంబటి మండిపడ్డారు. వ్యవసాయం దండగన్న వ్యక్తి ఇప్పుడు నేనెక్కడన్నానని ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన అధికారంలో ఉన్నపుడు ఓ రైతు ఎండిపోయిన పంటని చూపించి నీరు విడుదల చేయమని కోరితే ఎండిపోయిన పంటకు నీరెందుకని చంద్రబాబు ప్రశ్నించారని అంబటి చెప్పారు. పంటలు వేయవద్దంటే ఎందుకు వేశారని కూడా గద్దించారన్నారు. చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర రికార్డులు బద్దలుకొట్టుకోవడం కోసం.. పైలాన్లు కట్టుకోవడం కోసం తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడానికి కాదని ఆయన స్పష్టంచేశారు.  డాక్టర్ రాజశేఖరరెడ్డిగారికంటే గొప్పగా పాదయాత్ర చేశానని చెబుతున్నారని అంటూ ఆయనకంటే మీ పాదయాత్ర ఎందులో గొప్పని ప్రశ్నించారు. ఆయన ఎన్ని రోజుల్లో నడిచారు.. మీరెన్ని రోజుల్లో నడిచారు.. ఆయనకొచ్చిన ప్రజల సంఖ్య ఎంత.. మీకు వచ్చిన ప్రజల సంఖ్య ఎంత.. రాజశేఖరరరెడ్డిగారు ఎలాంటి వాతావరణంలో పాద యాత్ర చేశారు.. మీరు ఎలా చేస్తున్నారూ ఓ సారి బేరీజు వేసుకుంటే ఎవరు గొప్పో తేలిపోతుందని అంబటి వివరించారు. ఏసీ వ్యానులో రాత్రింబగళ్ళు గడిపిన వ్యక్తివి రాజశేఖరరెడ్డిగారి గురించి మాట్లాడడం తగదన్నారు. తను అధికారంలో ఉన్న సమయంలో ఆర్టీసీ ప్రైవేటుపరం చేస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆ పని చేయనని చెబుతున్నారన్నారు. దేశంలో 87 ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తే.. ఒక్క మన రాష్ట్రంలోనే చంద్రబాబు 47 సంస్థలను ప్రభుత్వపరం చేశారన్నారు.  ప్రైవేటు సంస్థల్ని నామా నాగేశ్వరరావు, సీఎం రమేష్ వంటి వ్యక్తులకు ధారాదత్తం చేసిన చంద్రబాబు మాటలను నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని అంబటి పేర్కొన్నారు. చంద్రబాబు నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు తెలస్తోందన్నారు. కాంగ్రెస్ నేత ఒకరు చేసిన సర్వేలో కాంగ్రెస్ కి 29, తెలుగుదేశం పార్టీకి 11, టీఆర్ఎస్ కి 48, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 191 వస్తాయని తేలిందన్నారు.
      విజయభాస్కర రెడ్డి సమయంలో 26 సీట్లు కాంగ్రెస్ కి వచ్చాయన్నారు. ఏరాజకీయ పార్టీకి రానన్ని తక్కువ సీట్లు ఈసారి చంద్రబాబుకు రాబోతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో శృంగభంగం తప్పదు అని తేలిపోయిందన్న తర్వాత ఎన్ని కిలోమీటర్లు నడిచినా ఉపయోగం లేదని ప్రజలకు అర్థమైంది కానీ చంద్రబాబుకు అర్థంకాలేదన్నారు. లోటస్ పాండ్ నివాసాన్ని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారుస్తానని చేసిన వ్యాఖ్యపై అంబటి స్పందిస్తూ.. చంద్రబాబుకు మతిభ్రమించిందనటానికి ఇది తార్కాణమన్నారు. చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి చేయాలన్నారు.

Back to Top