న్యూజెర్సీలో వైయస్ఆర్ కాంగ్రెస్ సమావేశం

న్యూజెర్సీ:

మాట తప్పని మడమ తిప్పని దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ లాగానే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్ని ఒడుదుకులు అయినా తట్టుకుని ప్రజల పక్షానే నిలుస్తారని అమెరికా లో న్యూజెర్సీలో వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో జరిగిన మీట్ అండ్ గ్రీట్ సమావేశం వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్య అతిధి గా సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశ రావు, మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు హాజరయ్యారు. అమెరికాలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాజన్న రాజ్యం శ్రీ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని రాష్ట్ర ప్రజలందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అని అన్నారు. మహానేత రాజశేఖర రెడ్డి 106 సంక్షేమ పధకాలను ప్రవేశ పెట్టి రాష్ట్రం, దేశం లోనే కాకుండా ప్రపంచం లోనే ఆదర్శం గా నిలిచారు అని తెలిపారు.

రాష్రం లో ఎవరి సహాయం లేకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని అంతే కాకుండా కేంద్రం లో కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాత్మక శక్తిగా మారతారని గోనె ప్రకాశ రావు అన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డికి సెప్టెంబర్ లో బెయిల్ మంజూరవుతుందనే నమ్మకం వుందని గోనే ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆళ్ళ రామి రెడ్డి, రమణ దేవులపల్లి, సురేష్ రెడ్డి, డాక్టర్ రాఘవ రెడ్డి తోపాటు 500 పైగా వైఎస్ఆర్ అభిమానులు హాజరయ్యారు. మహానేత రాజశేఖరరెడ్డి కుటుంబానికి అండగా నిలిచిన భూమన కరుణాకర్ రెడ్డిని, సురేష్ రెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సహదేవ రెడ్డి శాలువాతో సత్కరించి మెమెంటోని బహూకరించినారు. ఈ సమావేశం ఆళ్ళ రామి రెడ్డి వందన సమర్పణతో ఘనంగా ముగిసింది.

Back to Top