నెల్సన్‌ మండేలా జీవితమే ఓ సందేశం

హైదరాబాద్, 12 డిసెంబర్ 2013:

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్స‌న్ మండేలా జీవితం ఓ సందేశమని వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ శాసనసభ పక్ష నాయకురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ ‌అన్నారు. అందుకు ఎక్కడో దక్షిణాఫ్రికాలో ఆయన మరణిస్తే.. ఇక్కడ మనం బాధపడుతున్నామన్నారు. మండేలా పూజనీయుడని ఆమె అభివర్ణించారు. రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. మండేలా సంతాప తీర్మానాన్ని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు ‌శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ మండేలా ప్రతి ఒక్కరికీ మార్గదర్శి అని పేర్కొన్నారు.
'నా జీవితమే సందేశం' అని చెప్పిన భారత జాతిపిత మహాత్మా గాంధీ మాదిరిగా నెల్సన్‌ మండేలా జీవితమే మనకు ఒక సందేశం అని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. అందుకే మానవాళి అంతా మండేలాను ప్రేమించారు, ఆదరించారని, అభిమానించారని, ఆత్మీయుడని అనుకున్నారని అన్నారు. మండేలా అందరివాడిగా, మనవాడిగా జీవించారన్నారు. ఒక మార్టిన్ లూధర్ కింగ్‌ జూనియర్, నెల్సన్ మండేలాలు మహాపురుషులని శ్రీమతి విజయమ్మ ప్రశంసించారు. అలాంటి మహాపురుషుల జీవితాలకు ఎల్లలు లేవన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి సుగుణాలను ఇలాంటి మహాపురుషుల నుంచి మనందరం నేర్చుకోవాలని అన్నారు.

మనుషుల మధ్య కులం, మతం, వర్గం లాంటి సంకుచితమైన సంకెళ్ళను తెంపి మనిషిని మనిషిగా నిలబెట్టడానికి మండేలా తన జీవితాన్ని పణంగా పెట్టారని శ్రీమతి విజయమ్మ గుర్తుచేసుకున్నారు. మూడు వంతుల జీవితాన్ని జైలులో గడిపినప్పటికీ పగ, ప్రతీకారం లేకుండా, దయా గుణంలో ఎవరెస్టు శిఖరంలా నిలిచారన్నారు. మానవాళిని మాటలు, చేతల ద్వారా నడిపిన మహనీయుల్లో మండేలా ఒకరని శ్రీమతి విజయమ్మ అభివర్ణించారు. అలాగే వివిధ పార్టీల శాసనసభ పక్ష నేతలు ఈ సందర్బంగా మండేలా దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని కొనియాడారు.

నెల్సన్‌ మండేలాలోని పట్టుదల, ఓర్పు, అసమాన వ్యక్తిత్వం అనుక్షణం పూజ్య బాపూజీని గుర్తుకు తెస్తుంటాయని శ్రీమతి విజయమ్మ కొనియాడారు. అందుకే మన దేశం ఆయనను 'భారత రత్న'గా గౌరవించిందని పేర్కొన్నారు. 'అలాంటి మానవుడు రక్త మాంసాలతో నిజంగానే మన మధ్య నడయాడారంటే.. బహుశా తరువాతి తరాలు నమ్మటం కష్టం' అని మహాత్మా గాంధీ గురించి శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ అన్న మాటలు మండేలాకు కూడా వర్తిస్తాయని ఆమె ప్రశంసించారు. ఇలాంటి మహానాయకులు భౌతికంగా మన మధ్య లేకపోయినా చిరంజీవిగా ఉంటారన్నారు. మండేలా జీవితాన్ని ఒక సందేశంగా తీసుకుని అందరం ఆచరించాలని శ్రీమతి విజయమ్మ సూచించారు.

తాజా వీడియోలు

Back to Top