విభజనపై బాబు వైఖరేమిటో చెప్పించండి

హైదరాబాద్:

రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ అ‌ధ్యక్షుడు చంద్రబాబు నాయుడి వైఖరేమిటో ఆ పార్టీ నాయకులు ఇప్పటికైనా చెప్పించాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ ఎమ్మెల్యేల కో-ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో‌ ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర విభజన విషయంలో ఇంత అన్యాయం జరిగాక తెలుగువారు అసలీ దేశంలో ఎందుకుండాలని సమైక్యవాదులమని చెప్పుకుంటున్న సీమాంధ్ర టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కానీ వారు ఆమాట అనే ముందు తమ అధినేత చంద్రబాబుతో సమైక్యమనే మాట ఎందుకు చెప్పించరు’ అని గడికోట నిలదీశారు.

ఇప్పటికైనా టీడీపీ నాయకులు తమ పార్టీ సభల్లో చంద్రబాబు నాయుడితో సమైక్యవాదం అనిపించాలని, లేకుంటే వారిని ఆయన ఆడిస్తున్న నాటకంలో భాగస్వాములుగా భావించాల్సి ఉంటుందని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలు విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రపతికి లేఖలు రాయాలని, పార్లమెంటులో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసేలా ఎంపీలకు విప్ జారీ చేయడమే‌గాక చంద్రబాబు దగ్గర ఉండి అది అమలు చేయించేలా ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేయాలని శ్రీకాంత్‌రెడ్డి సూచించారు.

Back to Top