చర్యలు తీసుకోకుండా గాడిదలు కాస్తున్నారా..?

  • విద్యార్థులు ప్రాణాలు బలిగొంటున్న నారాయణ, శ్రీచైతన్య
  • చర్యలు తీసుకోకుండా మీటింగ్‌లు పెట్టడం సిగ్గుచేటు
  • ఆ తల్లిదండ్రుల కన్నీరు మీకు కనిపించడం లేదా
  • మంత్రులు నారాయణ, గంటా వల్లే పెరుగుతున్న మృతులు
  • 40 మంది చనిపోయారని చెప్పడానికి మంత్రికి సిగ్గుండాలి
  • ప్రభుత్వ కమిటీలో తల్లిదండ్రులను కూడా చేర్చాలి
  • బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించాలి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
హైదరాబాద్‌: విద్యార్థులు కాలేజీలకు వెళ్లేది చదువు కోసమా.. లేక చావు కోసమా చంద్రబాబు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంటున్న నారాయణ, శ్రీచైతన్య కళాశాలలపై చర్యలు తీసుకోకుండా ఇంకా ఎంత మంది పిల్లలు చనిపోతారోనని ఎదురు చేస్తున్నారా అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. కార్పొరేట్‌ కాలేజీల్లో రోజు రోజుకు పెరిగిపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ...చదువు కోసం కాలేజీలకు వెళ్లిన పిల్లలు ఇంటికి క్షేమంగా తిరిగి వస్తారా అనే భయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కల్పించిందని అన్నారు. 

నారాయణ, గంటాలను కాపాడేందుకే మీటింగ్‌..
తప్పు చేసిన వారిని గుర్తించి శిక్షించాల్సింది పోయి కాలేజీ యాజమాన్యాలతో చంద్రబాబు మీటింగ్‌ పెట్టడం సిగ్గుచేటని రోజా మండిపడ్డారు. ఇంట్లో దొంగలు పడితే మీటింగ్‌ పెట్టి మాట్లాడుతారా.. లేక పోలీసులకు ఫిర్యాదు చేసి శిక్షించాలని ఆదేశిస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు. అన్ని కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలతో మీటింగ్‌ పెట్టి కాఫీలు ఇచ్చి ఇక నుంచి తప్పు చేయవద్దు అని చెప్పడానికి సిగ్గుండాలని ఆరోపించారు. అన్యంపుణ్యం తెలియని పిల్లలు చనిపోతుంటే ఆ తల్లిదండ్రులు పెట్టే కన్నీరు చంద్రబాబు సర్కార్‌కు కనిపించడం లేదా.. మీ మనస్సుకు చీమకుట్టినట్లుగా కూడా లేదా అని రోజా దుయ్యబట్టారు. మంత్రుల వల్ల పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయన్నారు. నారాయణ, గంటా శ్రీనివాసరావులను కాపాడుకోవడానికే బాబు మీటింగ్‌ పెట్టారని ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. ఈ మూడున్నరేళ్లలో ఎన్ని వందల కోట్లకు అమ్ముడుపోయారో, విద్యా వ్యవస్థను ఏ విధంగా భ్రష్టుపట్టించారో అందరికీ తెలుసన్నారు. 

మూటలు తీసుకుంటూ నోర్లు మూశారు...
మూడున్నరేళ్లలో 40 మంది విద్యార్థులు చనిపోయారని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పుకోవడానికి సిగ్గులేదా అని ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత వహించి రాజీనామా చేయాలనే సంగతి కూడా మంత్రికి తెలియదా అని నిలదీశారు. 158 హాస్టల్స్‌ అనుమతి లేకుండా పనిచేస్తున్నాయని ప్రకటించారు కానీ అనుమతి లేదని తెలిసి కూడా మీరు మీ అధికారులు చర్యలు తీసుకోకుండా గాడిదు కాస్తున్నారా.. అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీల యాజమాన్యాలు ఇచ్చే మూటలు ప్రభుత్వ నోర్లు మూసేశాయని స్పష్టంగా తెలుస్తుందన్నారు. మా పిల్లల్ని వేధించి చంపేస్తున్నారని తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నా.. ఆ కాలేజీలపై తనిఖీలు లేవు. కర్నూలు, కడప, గుంటూరు, గూడవల్లిలో పిల్లలు చనిపోతుంటే ఆ కాలేజీల్లో ఎందుకు తనిఖీలు చేయడం లేదని ప్రశ్నించారు. సాయి ప్రజ్వల అనే విద్యార్థిని లెటర్‌ రాసి పారిపోయిందంటే ఆ కాలేజీలు ఎంత నరక కూపాలో ఇంతకంటే నిదర్శనం ఉందా.. గుంటూరులో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడంటే దానికి కారణం ఏంటని నిలదీశారు. 

చేతులు దులుపుకోవడానికే కమిటీలు
కళాశాలల్లోని విద్యార్థులు చనిపోయినా పర్వాలేదు కానీ మీరు మీ వియ్యంకుడు నారాయణ మాత్రం పేదల డబ్బులను దోచుకుంటూ ఆర్థికంగా ఎదగడానికి ఆలోచిస్తారా అని రోజా గంటాపై ఫైర్ అయ్యారు. నారాయణ కాలేజీలు అంటే ‘నారా’ బినామీలు కాబట్టి వదిలేశారా అని రోజా ప్రశ్నించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. పిల్లల చావులకు కారణం అవుతున్న నారాయణ, శ్రీచైతన్య కళాశాలలపై తిరుగుబాటుకు సిద్ధం కావాలని సూచించారు. ఆత్మహత్యలపై చేతులు దులుపుకోవడానికి కమిటీ వేస్తున్నామంటూ ప్రకటించడం దారుణమన్నారు. దొంగ చేతులకు తాళాలు ఇస్తే ఎవరికీ న్యాయం జరగదని, గతంలో పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో 30 మందిని చంపి కమిటీ వేశాడు, రిషితేశ్వరి  కేసులో కమిటీ వేశాడు ఏమైంది.. ఇప్పటి వరకు ఒక్క నివేదిక అయినా వచ్చిందా అని ప్రశ్నించారు. 

నారాయణ, గంటాలను బర్తరఫ్‌ చేయాలి..
తన ఫోటో మీద చెత్త వేశారని టీవీలో రాగానే ఊగిపోయి ఇంటర్‌ బోర్డ్‌ అధికారితో విచారణ జరిపించిన చంద్రబాబు నారాయణ కాలేజీల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే విచారణ చేయించాలని తెలియదా అని రోజా ప్రశ్నించారు. చిన్న వర్షానికే అసెంబ్లీకి చిల్లుబడితే ఆ నింద ప్రతిపక్షంపై వేసి ఎంక్వైరీ వేసిన చంద్రబాబు నారాయణ కాలేజీలపై విచారణ జరిపించాలనే ఆలోచన లేదా అని ఫైరయ్యారు. ప్రభుత్వ కమిటీలో ఉద్యోగులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను, తల్లిదండ్రులను చేర్చాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా చనిపోయిన 40 మంది విద్యార్థులకు ఒక్కోక్కరికి రూ. 25లక్షల నష్టపరిహారం అందించాలని, మంత్రులు నారాయణ, గంటాలను బర్తరఫ్‌ చేయాలని రోజా డిమాండ్‌ చేశారు. 
Back to Top