సిగ్గుతో తలదించుకోక ఎదురుదాడా?

విజయవాడ: చేసిన తప్పుకు సిగ్గుతో తలదించుకోవాల్సిందిపోయి టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగడం దుర్మార్గమని  ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. తన కొడుకు తప్పు చేస్తే ఎలాంటి పైరవీలు నడిపించుకోకుండా నిజాయితీగా అరెస్టు చేయండి అని చెప్పిన వ్యక్తి బాలసుబ్రమణ్యం అని కొనియాడారు. అలాంటి నిజాయితీగల అధికారిపై టీడీపీ ప్రజాప్రతినిధులు దాడులకు పాల్పడడం బాధాకరమన్నారు. వైయస్‌ జగన్‌ రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు కావాలనే కుట్రపూరితంగా క్రిమినల్‌ కేసులు పెట్టారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ అధికారులకు సారీ చెప్పలేదు అందుకే కేసు పెట్టారు. మేం చెప్పాం అందుకే కేసు పెట్టలేదు అంటూ ఎదురుదాడికి దిగడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేశినేని ట్రావెల్స్‌ను బంద్‌ చేస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల మాఫియా నడుస్తోందని ఆరోపించారు. పల్నాడు ప్రాంతంలో ఎమ్మెల్యేలు చెబితేనే పోలీసులు పనిచేయాలనే రీతిలో చంద్రబాబు ఆర్డర్స్‌ తీసుకొచ్చారని విమర్శించారు. పొలంలో నుంచి సిమెంట్‌ రోడ్డు వేస్తున్నందుకు ఎమ్మార్వోను ప్రశ్నిస్తే ఆమెతో బలవంతంగా తనపై కేసులు పెట్టించారని గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. పదివేల మంది ప్రజలకు పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడిస్తే అప్పుడు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి తనను విడుదల చేశారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నేతలు ఎవరు ఎదురుతిరిగినా కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేసి అణచివేయాలనే ధోరణిలో ప్రభుత్వం పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

Back to Top