మరో ప్రజాప్రస్థానంలో చారిత్రక ఘట్టం

కొండప్రోల్(మిర్యాలగుడా) 18ఫిబ్రవరి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారంనాడు ఓ చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించింది. వెయ్యి కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకూ, వాటిని సమర్థిస్తున్న చంద్రబాబు వైఖరికీ నిరసనగా గత ఏడాది అక్టోబర్ 18న పాదయాత్ర ప్రారంభమైంది. వైయస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ప్రార్థనలు చేసిన అనంతరం ఆమె వేలాది ప్రజలు వెంట నడువగా పాదయాత్రను ఆరంభించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడా నియోజకవర్గంలోని కొండ్రపోల్ గ్రామానికి చేరుకునే సరికి ఆమె వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రను అధిగమించారు.

     వైయస్ఆర్ కడప జిల్లాలో 82.5 కిమీ నడిచారు. అనంతపురం జిల్లా తాడిమర్రి వద్ద పాదయాత్ర వందో కిలోమీటరుకు చేరింది. తీవ్ర జ్వరం వచ్చినప్పటికీ, హోరున వాన కురుస్తున్నప్పటికీ ఆమె వెరవక నడకను కొనసాగించారు. అనంతపురం జిల్లాలో ఐదు నియోజకవర్గాల గుండా పాదయాత్ర కొనసాగింది. మొత్తం 194.5 కిలోమీటర్లు నడిచారు. నవంబరు 11న మద్దికెర వద్ద కర్నూలు జిల్లాలోకి శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రవేశించింది. జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల గుండా ఆమె పాదయాత్ర సాగింది. పదిహేను రోజులపాటు ఆమె మొత్తం 195 కి.మీ నడిచారు. నవంబరు 22న కర్నూలు జిల్లాలో యాత్ర ముగిసింది. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరు నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర చేశారు. డిసెంబరు 11న రంగారెడ్డి జిల్లాలోకి యాత్ర ప్రవేశించింది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు ఆమె కాలికి గాయం కావడంతో డిసెంబరు 15న యాత్ర నిలిచిపోయింది. డిసెంబరు  డిసెంబరు 18న ఆమె కాలికి అపోలో ఆస్పత్రిలో శస్త్ర చికిత్స నిర్వహించారు. తదుపరి ఆరువారాల పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఆమేరకు విశ్రాంతి తీసుకున్న శ్రీమతి షర్మిల వైద్యుల అంగీకారంతో ఈ ఏడాది ఫిబ్రవరి ఆరో తేదీన పాదయాత్రను పునఃప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ నుంచి ఆమె నడకను తిరిగి ప్రారంభించారు. ఫిబ్రవరి 8న మాల్ గ్రామం వద్ద శ్రీమతి షర్మిల నల్గొండ జిల్లాలో అడుగుపెట్టారు. ఐదు నియోజకవర్గాలలో సాగింది. మిర్యాలగుడా నియోజకవర్గం కొండ్రపోల్ వద్ద వెయ్యి కిలోమీటర్ల నడకను పూర్తిచేసుకున్నారు.


     ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటైన సభలో శ్రీమతి షర్మిల మాట్లాడారు. 'మీ జగనన్న చెల్లెలు మీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తోంది' అని అనడంతో ప్రజలు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. పాదయాత్రను వైయస్ఆర్ మహాయజ్ఞంలా చేశారని ఆమె పేర్కొన్నారు. పాదయాత్రలు రికార్డుల కోసం చేయడం లేదన్నపుడు కూడా అంతే స్పందన లభించింది. పండుగలా కూడా చేయడం లేదన్నారు. నాన్నగారి ఆశీస్సుల వల్ల ఈ పాదయాత్ర వేయి కిలోమీటర్లను పూర్తిచేశానని ఆమె పేర్కొన్నారు.
అంతకు ముందు ఆమె గ్రామంలో నెలకొల్పిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అక్కడే ఏర్పాటుచేసిన  రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వై.వి. సుబ్బారెడ్డి ప్రారంభించారు. జిట్టా బాలకృష్ణారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు ఇందులో పాల్గొన్నారు.

     శ్రీమతి షర్మిల యాత్ర ప్రారంభించిన నాటి నుంచి వేలాది మంది ప్రజలు ఆమె వెన్నంటి నడిచారు. వృద్ధులు, వికలాంగులు, పిల్లలు ఇలా అందరూ ఆమె వెంట పాల్గొంటున్నారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ తో నడిచిన వెంకటయ్య అనే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వికలాంగుడు చేతి కర్ర సాయంతో ఆమె వెంట నడుస్తున్నారు. ఎన్నారైలు కూడా పాదయాత్రలో పాలుపంచుకుంటున్నారు. మహిళలు వెల్లువలా తరలివస్తున్నారు.
    
     యాత్ర దారి పొడుగునా శ్రీమతి షర్మిల ప్రతిరోజు రచ్చబండ నిర్వహిస్తున్నారు. మహిళలను, వృద్ధులనూ, రైతులను, కూలీలనూ,  విద్యార్థులనూ ఇలా అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నారు. అందరూ చెప్పేవి వింటున్నారు. అధైర్య పడవద్దని భరోసానిస్తున్నారు. జగనన్న నేతృత్వంలో రాజన్న రాజ్యం ఆవిష్కృతమవుతుందనీ, అంతవరకూ ధైర్యంగా ఉండాలనీ కోరుతున్నారు. ప్రభుత్వ విధానాలను తూర్పారపడుతున్నారు. రాజన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఏ విధంగా నీరు గారుస్తున్నదీ ఆమె వారికి వివరిస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే పథకాలను ఆమూలాగ్రం వివరిస్తున్నారు. ఎక్కడికెళ్లినా ప్రజలు ఆమెను సొంత ఆడబిడ్డలా ఆదరిస్తున్నారు.
నీటి ప్రాజెక్టులను చూసినప్పుడు ఆమె మహానేతను తలచుకుని ఉద్వేగానికి లోనయ్యారు.  స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నారు. అప్పటికప్పుడు పరిష్కరించాల్సిన అంశాలను ఆయా ప్రాంతాల పార్టీ నేతలకు అప్పగిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆమె సభలకు వేల సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. అక్కా, అన్నా, పెద్దయ్యా, పెద్దమ్మా అంటూ తనకెదురైన వారిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు శ్రీమతి షర్మిల.

Back to Top