మహిళలు సాధికారత సాధించాలి

బాపట్ల (గుంటూరు జిల్లా), 5 మే 2013: మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని, ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ పిలుపునిచ్చారు. మహిళలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలని దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎన్నో పథకాలను రూపొందించి అమలు చేశారని ఆమె గుర్తుచేశారు. గుంటూరు జిల్లా బాపట్లలోని ఆర్ట్సు అండ్‌ సైన్సు కళాశాల సునీల ప్రాంగణంలో ఆదివారం రాత్రి జరిగిన 'మహిళా నగారా' బహిరంగ సభను ఉద్దేశించి శ్రీమతి విజయమ్మ ప్రసంగించారు. ఈ నగారాలో తొలుత తెనాలిలో ఇటీవల దారుణంగా మృతి చెందిన సునీలకు నివాళులర్పించారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి సభకు అధ్యక్షత వహించారు. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, పెరుగుతున్న నేర ప్రవృత్తి, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ఇతర అంశాలపై విజయమ్మ సుదీర్ఘంగా ప్రసంగించారు.

మహిళలు అభివృద్ధి చెందాలని కందుకూరి వీరేశలింగం పంతులు, రాజా రామమోహన్‌రాయ్‌, అంబేద్కర్‌ లాంటి మహనీయులు ఎంతో కృషిచేశారని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించడానికి కూడా కొందరు కృషిచేసి వైనాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు.

అధికారానికి కేంద్ర బిందువైన అమ్మకు ఇప్పుడు భద్రత లేకుండాపోయిందని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక దాడులు, హత్యలు, వరకట్న వేధింపులు పెరిగిపోయాయని ఆమె విచారం వ్యక్తంచేశారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 66వ సంవత్సరం జరుగుతున్నా మహిళలకు స్వేచ్ఛ లేకుండాపోయిందని అన్నారు.

మద్యం విక్రయాలు పెరిగిపోవడం వల్ల రాష్ట్రంలో తాగుబోతులు ఎక్కువై అత్యాచారాలు, కత్తితో గొంతు కోసిన ఘటనలు, యాసిడ్‌ దాడులు, వరకట్న వేధింపులు, కిడ్నాపులు, లైంగిక దాడులు ఇలా అనేక అకృత్యాల్లో ఆడవాళ్ళు బాధితులుగా ఉంటున్నారని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. తెనాలిలో మద్యం షాపు వద్ద పోలీసులు చూస్త్తూండగానే కొందరు యువకులు సునీలను బస్సుకింద తోసివేసి దారుణంగా హత్య చేశారన్నారు. నేడు ఆరేళ్ళ పిల్ల నుంచి 70 ఏళ్ళ వృద్ధుల వరకు అందరిపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం గుడ్డిదైతే నేరగాళ్ళు, తాగుబోతులు రాజ్యమేలుతారని దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 70 శాతం మహిళలే అందులోనూ వివాహితలే ఉండడం అత్యంత బాధాకరం అన్నారు. లైంగిక వేధింపుల్లో మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, వరకట్నం వేధింపుల్లో రెండవ స్థానంలో ఉందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. 
ఏటా సగటున 150 వరకట్న ఆత్మహత్యలు, 1,200లకుపైగా వేధింపు కేసులు నమోదు అవుతున్నాయని విచారం వ్యక్తంచేశారు. ఏటా సగటున 780 అత్యాచార కేసులు, 1,169 కిడ్నాప్‌ కేసులు, 1,296 ఆత్మహత్య కేసులు నమోదవుతున్నాయన్నారు. మహిళలపై ఏం జరిగినా కఠిన శిక్షలు లేవని, రెండు లక్షల కేసుల్లో 660 మందికి కూడా శిక్షలు పడలేదంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. ప్రభుత్వ పరోక్ష చర్యల వల్లే నేరాలు పెరుగుతున్నాయని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు.

ఎండలు పెరిగిపోయిన ఈ తరుణంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంచినీరు ఇవ్వరు గానీ బీరు ఉత్పత్తి, విక్రయాలు ఎంత పెంచాలని ఆలోచన చేస్తున్నారని దుయ్యబట్టారు. మద్యం కారణంగానే పట్టుగొమ్మల్లాంటి పల్లెల్లో కూడా నేతప్రవృత్తి పెరిగిపోయిందని, మహిళలపై నేరాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మద్యాన్ని ఈ ప్రభుత్వం ఆదాయ వనరుగానే చూస్తోంది గాని దాని ద్వారా మహిళలు, పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయన్న స్పృహ కూడా లేకుండా వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ విధానమే మద్యం అయితే ఇక నేరాలు, ఘోరాలు జరగకుండా ఎలా ఉంటాయని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు స్వార్థం కోసమే మద్య నిషేధాన్ని ఎత్తివేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీతో కలిసి చంద్రబాబునాయుడు మిలాఖత్‌ రాజకీయాలు చేస్తున్నారని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. జగన్‌బాబును జైల్లోనే ఉంచి అణగదొక్కాలనే కుట్రతో రాబోయే రోజుల్లో ఆ రెండు పార్టీలు మాయకూటమిగా ఆవిర్భవించవచ్చని చెప్పారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి సిఎంగా ఉన్నప్పుడు మహిళలకు భరోసా ఉండేదని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. మహిళను వేధించిన వారికి కఠనమైన శిక్షలు విధిస్తామన్న బలమైన సంకేతాలను ఆయన స్పష్టంగా ఇచ్చారన్నారు. దీనితో మహిళల పట్ల చెడుగా ప్రవర్తించాలంటేనే భయం ఉండేదన్నారు. మహానేత వైయస్‌ హయాంలో మద్యం మీద కేవలం రూ. 5 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడది ఎన్నో రెట్టు పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళలకు సాధికారత కల్పించేందుకు మహానేత వైయస్‌ పావలా వడ్డీ రుణాల పథకాన్ని అమలు చేశారన్నారు. అయితే ఇప్పటి సిఎం వడ్డీ లేని రుణాలు ఇస్తామని గొప్పగా చెబుతున్నా బ్యాంకులు ముక్కు పిండి మరీ వడ్డీ వసూలు చేస్తున్నాయని ఆరోపించారు.

మహిళలు ఆర్థికంగా ఎదగాలని, అర్ధరాత్రి కూడా స్వేచ్ఛగా తిరిగే వాతావరణం కల్పించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నారని శ్రీమతి విజయమ్మ స్పష్టంచేశారు. పేదలను సర్వనాశనం చేస్తున్న మద్యాన్ని నియంత్రించాలని జగన్‌బాబు పార్టీ తొలి ప్లీనరీ సందర్భంగానే స్పష్టంగా ప్రకటించిన వైనాన్ని ఆమె గుర్తుచేశారు. మహిళలకు రక్షణ కల్పించే బాధ్యతను తాను తీసుకుంటానని కూడా ఆయన అప్పుడే ప్రకటించారన్నారు. మహిళలను మహానేత వైయస్‌ అన్నగా, సిఎంగా ఎలా భద్రత కల్పించారో జగన్‌బాబు కూడా అన్నగా, తమ్ముడిగా రక్షణ కల్పిస్తారని ఆమె హామీ ఇచ్చారు. అమ్మకు అధికారంతో పాటు లాఠీలు కూడా జగన్‌బాబు ఇస్తారని తెలిపారు. వైయస్‌ ఆలోచనా విధానంలోనే జగన్‌బాబు కూడా జనరంజకంగా పరిపాలన చేస్తారని శ్రీమతి విజయమ్మ చెప్పారు.

డాక్లర్‌ వైయస్‌ అమలు చేసిన పథకాలకే పేర్లు మార్చి సిఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి కొత్త పథకాలు పెడుతున్నట్లు గొప్పగా చెప్పుకుంటున్నారని శ్రీమతి విజయమ్మ ఎద్దేవా చేశారు. కిరణ్‌ కొత్తగా చెబుతున్న 'బంగారు తల్లి' పథకం గతంలో మహానేత వైయస్‌ పెట్టిన 'బాలికా సంరక్షణ' పథకమే అన్నారు.
Back to Top