మా ఇంటి బంధువయా


– ప్రజా సంకల్ప యాత్రలో ఆకర్షణగా నిలిచిన చిన్నారులు
–  ఆరోగ్యశ్రీతో పాపను కాపాడుకున్నామంటున్న తల్లిదండ్రులు
 – నవరత్న పథకాలతో ఒకే విధమైన డ్రెస్‌లు 
– జననేతపై అభిమానాన్ని చాటుకున్న వినుకొండ వాసులు


బతికున్న వాళ్లు పక్కన ఉంటూ కూడా ఎలాంటి సాయం చేసే రోజులు కావివి. కానీ దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయినా కూడా ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంతో మా బిడ్డ  ప్రాణాలు కాపాడారు అంటోంది ఆ తల్లి. వినుకొండకు చెందిన కోనంగి పల్లవి కూతురు నాగవర్ధిని. ఆ బిడ్డకు 8 ఏళ్ల క్రితం పెద్ద ఆపరేషన్‌ జరిగింది. అయితే వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఆ ఆపరేషన్‌ ఉచితంగా జరిగింది. బిడ్డ బతికింది. మేం బతికినంతకాలం వైయస్‌ఆర్‌ మా ఆత్మబంధువే అంటు ఈ దంపతులు పల్లవి, సురేష్‌లు మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఈ దంపతులకు వెన్నెల, నాగవర్ధిని, తేజస్వీని కూతుళ్లు.  మహానేత కుమారుడు వైయస్‌ జగన్‌ ఎప్పుడు ఆ ప్రాంతానికి వెళ్లినా ఈ దంపతులు తమ బిడ్డలతో వెళ్లి కలుస్తుంటారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నరసరావుపేటకు వచ్చిన వైయస్‌ జగన్‌ను సురేష్, పల్లవి దంపతులు కలిశారు. తమ బిడ్డలకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అమలైన పథకాలను, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టే 9 రకాల నవరత్నాల పథకాలను ప్రస్తావిస్తూ డ్రెస్‌ మీద రూపొందించుకొని వైయస్‌ జగన్‌ను గంగన్నపాలెం వద్ద కలుసుకున్నారు. దీంతో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ చిన్నారులను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నారు. ఈ సందర్భంగా పల్లవి మాట్లాడుతూ..వైయస్‌ రాజశేఖరరెడ్డి మా ఇంటి దేవుడని, ఆయన భౌతికంగా లేకపోవడంతో మహానేత కుమారుడు వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితే నవరత్నాల్లాంటి పథకాలను అమలు చేసి మహానేత మాదిరిగానే మంచి పాలన అందిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మాకు ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి అమ్మ ఒడి పథకం నాకు ఉపయోగకరంగా ఉంటుందని వెయ్యి కళ్లు కాదు..ఒళ్లంతా కళ్లు చేసుకొని వైయస్‌ జగన్‌ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అని ఎదురు చూస్తున్నామని పల్లవి చెప్పారు. ఈ ముగ్గురు ఆడబిడ్డలు ప్రజా సంకల్ప యాత్రలో ఆకర్షణగా నిలిచారు.  వీరి మాదిరిగానే చాలా మంది ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొని మహానేతపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. 
 
Back to Top