మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కరువు

  • మహిళా మంత్రులకు వడ్డాణాలు, దందాలపైనే శ్రద్ధ
  • మంత్రి రావెలను బర్తరఫ్‌ చేయాలి
  • పెద్ద నోట్ల రద్దుపై బాబు ఊసరవెళ్లిలా మాట్లాడుతున్నారు
  • వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్కే రోజా
విశాఖ: అధికార తెలుగుదేశం పార్టీ నేతలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు,  ఎమ్మెల్యే ఆర్కే రోజా నిప్పులుచెరిగారు. రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కరువైందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీని అరాచకప్రదేశ్, అఘాయిత్యాల ప్రదేశ్‌గా చేశారని మండిపడ్డారు. శనివారం విశాఖలో రోజా మీడియాతో మాట్లాడారు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు ఆడవాళ్ల మాన, ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ షేక్‌ జానీమూన్‌ మీడియా ముందు ఎంతో ఆవేదన వ్యక్తం చేసిందని, రాష్ట్ర మంత్రి రావెల కిశోర్‌బాబుతో తనకు ప్రాణహాని ఉందని చెప్పిందని రోజా గుర్తు చేశారు. జానీమూన్‌ అంతగా భయాందోళనలు వ్యక్తం చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆమె బాధను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. 

చిత్తూరులో మేయర్‌ మృతిచెందినా, రామలక్ష్మిని పలువురు వేధించినా వారు మౌనంగానే ఉన్నారని రోజా అన్నారు. ఇప్పుడు జానీమూన్‌ లాంటి మహిళల బాధను కూడా పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. నారాయణ కళాశాల యాజమాన్యం ఒత్తిడి భరించలేక మెడికోలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, నారాయణ కాలేజీలో ఇప్పటి వరకు ఎంతో మంది విద్యార్థులు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు సర్కారు రక్షణ ఇవ్వలేకపోతోందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.  టీడీపీ మహిళా నేతలు ఇప్పుడైనా స్పందించాలని, సదరు మంత్రిని బర్తరప్‌ చేయాలని ప్రభుత్వం ముందు డిమాండ్‌ చేయాలని ఆమె అన్నారు. ఏపీలో మహిళలకు ఎంతగానో అన్యాయం జరుగుతుందని అయినప్పటికీ టీడీపీ మహిళా నేతలు వాటిపై ఏ మాత్రం స్పందించడం లేదని ఆమె విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల కోసం ఒక్క కార్యక్రమం కూడా చేపట్టడం లేదని రోజా విమర్శించారు.  

సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు
పెద్దనోట్ల రద్దు తర్వాత సామాన్యులు కష్టపడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ఊసరవెళ్లి కన్నా వేగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రంగులు మారుస్తున్నారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. రాష్ట్రంలో ఆడవాళ్ల, మాన, ప్రాణాలతో సీఎం చంద్రబాబునాయుడు, ఆయన మంత్రులు చెలగాటం ఆడుతున్నారని.. బాబు ఏమాత్రం సిగ్గు లేకుండా 175 సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ అనేది.. తెలుగుదేశం పార్టీనా లేక దొంగల పార్టీనా.. దుర్యోధనుల పార్టీనా అని, మహిళలకు అన్యాయం జరుగతున్నా టీడీపీలో ఉన్న మహిళా నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె ప్రశ్నించారు.  మంత్రి రావెల కిశోర్‌బాబును బర్తరఫ్‌ చేయాలని టీడీపీ మహిళా నేతలు ఇప్పుడైనా డిమాండ్‌ చేయాలని రోజా సూచించారు. 
 
Back to Top