కేసీఆర్ అరాచక పాలన

గ్రామాలను నిర్బంధించి పోలీస్ రాజ్యం
రీడిజైన్ పేరుతో బలవంతపు భూసేకరణ
దుర్మార్గమైన చర్యగా అభివర్ణించిన వైయస్సార్సీపీ
న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్న నేతలు
కేసీఆర్ కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిక

హైదరాబాద్ః టీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్నసాగర్ వద్ద భూసేకరణ కోసం చుట్టు ప్రక్కల గ్రామాలను నిర్భందించి పోలీస్ రాజ్యం చేస్తోందని తెలంగాణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి, శ్రీధర్ రెడ్డిలు మండిపడ్డారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ప్రశ్నించారు.  కేసీఆర్ ప్రజలను నిర్బంధించి పాలన చేస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తడకపల్లి వద్ద రిజర్వాయర్ కట్టేందుకు అప్పటికే కాలువలు పూర్తయినప్పటికీ  రీడిజైన్ పేరుతో బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.  ఇది దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కేసీఆర్ అరాచక పరిపాలనను వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ నుదిటితో వెక్కిరించే పరిపాలన చేస్తే కేసీఆర్ కు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ప్రజల అంగీకారం లేకుండానే భూసేకరణ చేయడం సరికారని ప్రభుత్వానికి సూచించారు. 2013లో పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారమే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు మార్కెట్ రేటు ప్రకారం నాలుగురెట్లు..ఇతరులకు మూడు రెట్లు పెంచి ఇవ్వాలన్నారు.  తెలంగాణ కోసం అష్టకష్టాలు పడి, భూపోరాటం చేసిన ఆప్రాంత ప్రజలను లొంగదీసుకోవాలనుకోవడం దుర్మార్గమన్నారు. మీ ఫాంహౌస్, రాజకీయ లబ్ధి కోసం ప్రజలను వంచించి మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తే వైయస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కరువు వచ్చినప్పుడు సైతం రెండు పంటలు పండే ప్రాంతం అయినందున...ప్రభుత్వం మేల్కొని ఎకరానికి 25 లక్షల చొప్పున  అక్కడి ప్రజలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కులవృత్తుల కుటుంబాలకు 10 లక్షలు చెల్లించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడుతున్నా ఎందుకు పట్టించుకోరని కేసీఆర్ ను నిలదీశారు. ప్రజలకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 

రీడిజైన్ పేరుతో కేసీఆర్ ఏకంగా ప్రాంతాన్నే మారుస్తున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.  దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ లో భాగంగా తడకపల్లిలో మల్లన్న, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ లు కట్టేందుకు నిర్ణయం తీసుకున్నారని, అక్కడ ఎవరూ ఇబ్బంది పడొద్దని కాలువలు కూడా పూర్తి చేశారని చెప్పారు. కేసీఆర్, హరీష్ రావుల రీడిజైన్ తంతంగం వల్ల  25 వేల ఎకరాలు ముంపుకు గురవుతున్నాయన్నారు. 14 గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో పాటు 20 వేల మంది రోడ్డున పడే ప్రమాదం ఉందని రాఘవరెడ్డి చెప్పారు. 

ఈపరిస్థితుల్లో కూడా ప్రజలు ఒక్కటే డిమాండ్ చేస్తున్నారని , వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన నిర్ణయం ప్రకారం ప్రాజెక్ట్ కట్టాలని అడుగుతున్నారని తెలిపారు. అది కాని పరిస్థితుల్లో 2013 చట్టం ప్రకారం వెళ్లాలని కోరుతున్నారన్నారు. వీటన్నంటినీ పక్కనబెట్టి గజ్వేల్, సిద్ధిపేటకు నీళ్లు తీసుకెళ్లేందుకు కేసీఆర్, హరీష్ రావులు  రీడిజైన్ పేరుతో మూర్భత్వపు ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని వైయస్సార్సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. 25 లక్షలు పలికే భూములకు 5 లక్షలు ఇస్తే ఏం సరిపోతాయని నిలదీశారు. ప్రజలకు నష్టం చేయొద్దని అన్ని పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.  పాలమూరు-రంగారెడ్డి రైతులు పిల్ వేస్తే  వారిని ఇబ్బంది పెట్టవద్దని హైకోర్టు సైతం ప్రభుత్వానికి  మొట్టికాయలు వేసిందని నేతలు పేర్కొన్నారు. 

భూములు ఇవ్వకపోతే 20 వేలమందికి  40 వేల మంది పోలీసులను పెట్టి భూములు లాక్కుంటామని హరీష్ రావు ప్రజలను బెదిరించడం దారుణమన్నారు. 25 వేల ఎకరాల్లోని రైతాంగం ఎక్కడకు పోవాలో ప్రభుత్వమే ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వం రీడిజైన్ చేయడం మొదటి పొరపాటు అయితే, వేలాదిమంది రోడ్డున పడుతుంటే పోలీసులతో గ్రామాలు ఖాళీ చేయిస్తామని  మాట్లాడడం అత్యంత హేయనీయమన్నారు.  కేసీఆర్ ఎర్రబల్లికో, ఫాంహౌస్ కో ముఖ్యమంత్రి కాదని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న సంగతి తెలుసుకోవాలన్నారు.  కమీషన్లు, కాంట్రాక్ట్ ల  కోసమే రీడిజైన్ లు చేస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక ప్రజలకు న్యాయం జరిగే వరకు వైయస్సార్సీపీ పోరాడుతుందని నేతలు తేల్చిచెప్పారు. 

బాబు వ్యభిచారం కన్పించలేదా..!
వివిధ పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవటం వ్యభిచారం అయినప్పుడు, ఏపీలో వైయస్సార్ సీపీ ఎమ్మెల్యేలను  చంద్రబాబు నాయుడు కోటాను కోట్లు ఎర చూపి లాగేసుకోవటం వ్యభిచారంగా కన్పించలేదా అని వైయస్సార్ సీపీ నేతలు ముకుమ్మడిగా రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. టీడీపీ రెండు నాల్కాల ధోరణి విడనాడాలని సూచించారు. ఇరురాష్ట్రాల సీఎంలు ఇలాగే వ్యవహరిస్తూ వెళ్తే, ముందు ముందు ప్రజల అగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు.


Back to Top