వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరిన కందుల సోదరులు

కడప:

వైయస్ఆర్‌ కడప జిల్లాలో రాజకీయంగా పేరున్న సీనియర్ నాయకులు కందుల సోదరులు‌ శనివారంనాడు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. కందుల శివానందరెడ్డి, అతని సోదరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త రాజమోహన్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి కూడా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పార్టీలో వీరి చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైయస్ఆర్‌సీపీ నేతలు వైయస్ వివేకానందరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సురే‌శ్‌బాబు, ఎమ్మెల్యే అభ్యర్ధి అంజద్ బాషా తదితరులు పాల్గొన్నారు.

‌తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న కందుల సోదరులు అనంతరం టీడీపీలో చేరి ‌చాలా కాలం కొనసాగారు. కొద్ది కాలంగా వీరు ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. మళ్ళీ కొద్ది కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గత నెలలోనే మళ్లీ ‌టీడీపీలో చేరారు.

కందుల శివానందరెడ్డి తొలుత కాంగ్రె‌స్ పార్టీలో ఉండేవారు. 1981 నుంచి 1986 వరకు శాసనమండలి సభ్యులుగా ఉన్నారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున కడప శాసనసభ స్థానం‌లో పోటీచేసి గెలిచారు. ఆ తరువాత కూడా ఆయన మూడు సార్లు పోటీచేసి ఓడిపోయారు. 1996లో టీడీపీలో చేరి, ఆ పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యులుగా పనిచేశారు. ఆయన సోదరుడు కందుల రాజమోహన్‌రెడ్డి కూడా పొలిట్‌బ్యూరో సభ్యునిగా పనిచేశారు. కందుల రాజమోహన్‌రెడ్డి మూడు సార్లు లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. 2011లో ఉప ఎన్నికల సందర్భంగా కందుల సోదరులిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Back to Top