కాంగ్రెస్‌తో బాబు కుమ్మక్కు కుట్ర

హైదరాబాద్, 24 జనవరి 2013:

ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నామనుకుంటున్న చంద్రబాబు...తమ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందని విధిలేని పరిస్థితిలో చెప్పుకుంటున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ ఎద్దేవా చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహానేత మరణానంతరం చంద్రబాబు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారన్నారు. డాక్టర్ శంకరరావు రాసిన లేఖతో టీడీపీ ఇంప్లీడయ్యి శ్రీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి కుట్ర చేశారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కడప జిల్లాలో ఆ పార్టీకి 86 ఓట్లు ఉన్నప్పటికీ వైయస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడానికి కూడా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారన్నారు. అయినప్పటికీ తమ అభ్యర్థి గెలుపొందారన్నారు. ఆ 86 ఓట్లు ఎవరికి పడ్డాయో నిజాయితీ ఉంటే చెప్పాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. అధికార పార్టీతో చంద్రబాబు మిలాఖత్ అయిన అంశం తూర్పు, పశ్చిమగోదావరి, పరకాల ఎన్నికల్లో మరోసారి స్పష్టమైందని చెప్పారు. రహస్యంగా ఢిల్లీ వెళ్ళి, చిదంబరాన్ని కలిశారన్నారు. ప్రధానిని కలిసినప్పుడు తన వెంట వచ్చిన బృందాన్ని బయటకు పంపి ఏంమాట్లాడింది కూడా చెప్పాలని ఆయన కోరారు. ఐఎమ్‌జీ భూముల విషయంలో తాను తప్పు చేశాననీ, అరెస్టు కాకుండా చూడాలనీ ప్రధానిని చంద్రబాబు ప్రాధేయపడ్డారన్నారు. ప్రతిగా ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రభుత్వం కూలిపోకుండా కాపాడతానని చెప్పారన్నారు.  

ఆ వార్తను ఎందుకు ఖండించలేదు బాబూ!

     ఈనాడుతో పొత్తు ఉన్న హిందూ పేపర్ గానీ, గతంలో తమకు వ్యతిరేకంగా ఉన్న టైమ్సు పత్రిక గానీ  2014లో రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు తెలుగు దేశం తన అస్తిత్వాన్ని అమ్ముకుని మద్దతు ఇస్తుందని రాశాయన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు మద్దతు పలకదనే అంశాన్ని కాంగ్రెస్ గమనించిందన్నారు. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ కూడా మద్దతు ఇవ్వదనే అంశాన్ని అర్థంచేసుకున్న కాంగ్రెస్ పార్టీ వేసిన గేలానికి తెలుగుదేశం పార్టీ చిక్కిందని రాశారనీ చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే ఈ వార్తను ఎందుకు ఖండించలేదని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. ఎఫ్ డీ ఐ బిల్లు పాస్ కావడం కోసం కాంగ్రెస్‌కు అనుకూలంగా గైర్హాజరైనపుడు వారిమీద ఎందుకు చర్య తీసుకోలేదని నిలదీశారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాన్ని ఇది వెల్లడిస్తోందన్నారు. అందుకనే సీబీఐ, ఇన్‌కం ట్యాక్సు, ఈడీ విభాగాలు చంద్రబాబుపై దర్యాప్తు చేయడం లేదన్నారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలునుంచి బయటకు వస్తే తమకు పుట్టగతులుండవనే భయంతో కుమ్మక్కు కుట్రను చంద్రబాబు కొనసాగిస్తున్నారని జనక్ ప్రసాద్ ఆరోపించారు. 2జి స్ర్పెక్టమ్, బొగ్గు, తదితర కుంభకోణాల్లో ప్రధానిని ఏనాడైనా చంద్రబాబు విమర్శించారా అని ప్రశ్నించారు. కామన్‌వెల్తు ఆటలలో అవకతవకల గురించి కూడా ఆయన మాట్లాడలేదన్నారు.

కాంగ్రెస్ వ్యతిరేక పోకడలేమయ్యాయి?
     కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీలో ఆ పోకడలు ప్రస్తుతం ఎక్కడా కనిపించడంలేదని జనక్ ప్రసాద్ పేర్కొన్నారు. 2004, 2009 ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించారన్నారు. ఆ తర్వాత 58స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయి ఓడిపోయారన్నారు.    గౌరవ మర్యాదలుండాలంటే ... చిరంజీవి మాదిరిగా టీడీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని సూచించారు. దానివల్ల కేంద్రంలో మంత్రిపదవైనా దక్కే అవకాశముంటుందని జనక్ ప్రసాద్ చెప్పారు. ప్రజలు చంద్రబాబును విశ్వసించడం లేదని స్పష్టంచేశారు. చంద్రబాబును నమ్ముకున్న సీఎం రమేష్, సుజనాచౌదరి లేక ఇతరులెవరైనా ప్రధానికి వినతిపత్రాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్న చంద్రబాబు.. సుజనాచౌదరి, రామోజీరావు, నామా నాగేశ్వరరావు, తదితరుల ఆస్థుల గురించి నోరు మెదపరన్నారు.  రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి 2014లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతారని జాతీయ పత్రికలో రాశారనీ, దాన్ని చంద్రబాబు గానీ, ఆయన వందిమాగధులు గానీ ఖండించలేదనీ అంటే అది వాస్తవమేనని అనుకోవాల్సి ఉంటుందనీ పేర్కొన్నారు. దీనివల్ల ఆయన జైలుకు వెళ్ళకుండా తనను తాను కాపాడుకుంటున్నారని భావించాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలతో పాటు, మెజార్టీ ఎమ్మెల్యేలను గెలుపొంది వైయస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని జనక్ ప్రసాద్ స్పష్టంచేశారు.

Back to Top