కాంగ్రెస్‌, టిడిపి మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఇదే నిదర్శనం

హైదరాబాద్‌, 17 సెప్టెంబర్ 2012‌: అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు  పాల్పడ్డాయనడానికి సోమవారం అసెంబ్లీలో టిడిపి సభ్యులు వ్యవహరించిన తీరే నిదర్శనం అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. విద్యుత్‌ సమస్య, వేలాది మంది విద్యార్థుల ఫీజు రీయింబర్సుమెంట్‌ లాంటి ఎంతో ప్రాముఖ్యం ఉన్న ప్రజా సమస్యలపై చర్చించకుండా అసెంబ్లీ సమావేశాలను తెలుగుదేశం పార్టీ అడ్డుకున్న తీరే ఈ విషయాన్న రుజువు చేస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నిప్పులు చెరిగారు. ఒక వైపున ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి విద్యుత్‌ సమస్యపై స్వల్ప కాలిక చర్చకు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్ అనుమతి ఇచ్చినా టిడిపి సభ్యులు పోడియం ముందుకు దూసుకుపోయి గందరగోళం చేయడాన్ని భూమన తప్పుపట్టారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజు సభలో ఎలాంటి చర్చా జరగకుండానే మంగళవారానికి వాయిదా పడిన అనంతరం కరుణాకరరెడ్డి మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా కాంగ్రెస్‌ పార్టీకి టిడిపి సభలో గందరగోళం సృష్టించి మద్దతుగా నిలుస్తోందని అన్నారు.

విద్యుత్‌ సమస్యపై సభలో చర్చించాలని బిఎసి సమావేశంలో అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా నిర్ణయించినప్పటికీ టిడిపి సభ్యులు స్పీకర్‌ పోడియం ముందుకు దూసుకుపోయి సభను జరగనివ్వకుండా అడ్డుకోవడం సరికాదని భూమన వ్యాఖ్యానించారు. టిడిపి సభ్యుల అవాంఛనీయ ప్రవర్తన కారణంగా ఐదు రోజులు మాత్రమే జరిగే శాసనసభ సమావేశాల్లో తొలి ఒక రోజు పూర్తిగా దుర్వినియోగం అయిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మిగిలిన నాలుగు రోజులైన సభను స్పీకర్ సజావుగా ‌నిర్వహించేలా అన్ని పార్టీల సభ్యులూ సహకరించాలని భూమన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అంశంపై మీ పార్టీ వైఖరి ఏమిటన్న మీడియా ప్రశ్నకు భూమన బదులిస్తూ, తమ పార్టీ ప్లీనరీ సమావేశంలో తీర్మానానికే ఇప్పటికీ కట్టుబడి ఉందని వివరించారు.

తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు వృథా:

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలి రోజు ఎలాంటి చర్చా లేకుండా మంగళవారానికి వాయిదా పడ్డాయి.  బిఎసిలో నిర్ణయించిన విధంగా అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహించకుండా తాము ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలపై తక్షణమే చర్చ చేపట్టాలంటూ తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ సభ్యులు సభలో తీవ్ర గందరగోళం సృష్టించారు. రెండు సార్టు వాయిదా పడిన అసెంబ్లీ మధ్యలో మొత్తం 40 నిమిషాల పాటు భేటి అయినా ఎలాంటి చర్చా జరగలేదు. విద్యుత్‌ సమస్యపైన టిడిపి, తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలంటూ టిఆర్‌ఎస్‌ సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్‌ పోడియం ముందుకు చొచ్చుకుపోయి తీవ్ర గందరగోళం సృష్టించారు. సభను సజావుగా నడవనివ్వాలని, ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వాలని వారికి స్పీకర్‌ పదేపదే విజ్ఞప్తి చేసినా వారు వినలేదు. దీనితో సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే గంట పాటు సభను వాయిదా వేశారు. పది గంటలకు సభ మళ్ళీ ప్రారంభమైనప్పుడు టిఆర్‌ఎస్‌ సభ్యులు మళ్ళీ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోడియంను చుట్టుముట్టారు. దీనితో మరోసారి అరగంటపాటు సభను వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ్యుల ప్రవర్తనలో ఎలాంటి మార్పూ లేకపోవడంతో స్పీకర్‌ మనోహర్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

శాసనసభలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సి ఉండగా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సభకు హాజరు కాలేదు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో ఉండి సిఎం, తన బావమరిది, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ ఇచ్చిన విందుకు హారజరైన చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల తొలిరోజు హాజరు కాలేదు.

అంతకు ముందు ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు. దీనితో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దుచేసి విద్యుత్‌ సమస్యపై స్వల్పకాలిక చర్చకు అనుమతిచ్చారు. అయినా టిడిపి, టిఆర్‌ఎస్‌ సభ్యులు తమ పంతం విడిచిపెట్టలేదు. 

విపక్షాల వాయిదా తీర్మానాలు : 

రాష్ట్రంలోని పేద బీసీ, ఈబీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని వైయస్ఆ‌ర్ కాంగ్రె‌స్ పార్టీ‌ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. విద్యుత్ సమస్యపై టీడీపీ, తెలంగాణ తీర్మానం పెట్టాలంటూ టీఆ‌ర్ఎ‌స్, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కుటుంబాలకు పెన్షన్లు ఇవ్వాలని సీపీఐ, తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా పాటించాలని బీజేపీ, పేద విద్యార్థులందరికీ ఫీజు రీయింబ‌ర్స్మెంట్ అమలు చేయాలని ఎంఐఎం వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి.‌

అసెంబ్లీకి ఎడ్లబండిపై విజయమ్మ, రిక్షాలపై ఎమ్మెల్యేలు:

డీజిల్ ధర పెంపు‌,‌ వంట గ్యాస్ సిలిండర్ల పరిమితిపై వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ వినూత్న‌ంగా నిరసన వ్యక్తం చేసింది. సోమవారం ఉదయం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ప్రభుత్వ తీరును నిరసిస్తూ పార్టీ ఎమ్మెల్యేలు ఆదర్శ్‌నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి సైకి‌ల్ రిక్షాల మీద శాసనసభకు ‌వెళ్ళారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఎడ్లబండిపై అసెంబ్లీకి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు.




Back to Top