కాంగ్రెస్‌, టిడిపిలకు బుద్ధిచెబితే రాజన్నరాజ్యం

బూడిదంపాడు (ఖమ్మం జిల్లా), 28 ఏప్రిల్‌ 2013: రాష్ట్రంలో ఉన్నది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. ఇంత ఘోరమైన ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉందంటే దానికి చంద్రబాబు నాయుడే కారణం అని నిప్పులు చెరిగారు. మొన్న అసెంబ్లీలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే.. కనీసం మద్దతు కూడా పలకలేదు. పైగా అవిశ్వాసానికి మద్దతు ఇవ్వవద్దని విప్‌ జారీ చేశారన్నారు. ఈ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడిన ఘనుడు చంద్రబాబు అని శ్రీమతి షర్మిల ఆరోపించారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలోని బూడిదంపాడులో అభిమానులు, స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలపై ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు.

సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్‌, టిడిపిలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పినప్పుడు, జగనన్నను ఆశీర్వదించినప్పుడు రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుందన్నారు. రాజన్న రాజ్యంలో ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్ళు వస్తాయని హామీ ఇచ్చారు. జగనన్న సిఎం అయితే.. గ్రామాల్లో బెల్టు షాపులు ఉండవన్నారు. వికలాంగులకు రూ.1,000, వృద్ధులు, వితంతువులకు రూ. 700 పింఛన్‌ వస్తుందని చెప్పారు. రైతులకు, మహిళలకు వడ్డీ లేని రుణాలను జగనన్న అందజేస్తారన్నారు. జగనన్న ఏ తప్పూ చేయలేదని, త్వరలోనే బయటికి వస్తారన్నారు. బయటికి వచ్చాక మనందరినీ రాజన్న రాజ్యం వైపు నడిపిస్తారని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు.

అంతకు ముందు శ్రీమతి షర్మిల బూడిదపాడులో మిర్చి రైతులను కలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  మిర్చిపంటకు గిట్టుబాటు ధర రావడంలేదని రైతులు శ్రీమతి షర్మిల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదివారం సాయంత్రం పండితాపురం చేరుకున్న శ్రీమతి షర్మిలకు అభిమానులు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గ్రామంలోని వైయస్‌ఆర్ విగ్రహం వద్ద‌ శ్రీమతి షర్మిల నివాళులర్పించారు.
Back to Top