'జనం గుండెల నిండా మహానేత వైయస్‌'

గంగవరం (చిత్తూరు జిల్లా): దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డిని రాష్ట్ర ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పేర్కొన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబమూ లబ్ధి పొందిందని అన్నారు. రాష్ర్టంలో‌ ప్రస్తుతం కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు ఏకమైపోయి ప్రజల బాగోగులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆ పార్టీల నాయకులు కుర్చీల కోసం పాకులాడుతున్నారని అమరనాథరెడ్డి విమర్శించారు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో తాను సేవకునిలా పనిచేస్తానని స్పష్టం చేశారు.

చిత్తూరు జిల్లా గంగవరం మండలం సాయిగార్డెన్ సిటీలో మాజీ ఎంపీపీ ‌సి.వి.కుమార్ నివాసం వద్ద శనివారం పలమనేరు మున్సిపాలిటీ, పలమనేరు రూర‌ల్, గంగవరం మండలాల వై‌యస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలు, టిడిపి నాయకులు, కార్యకర్తలతో ఆయన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అమరనాథరెడ్డి మాట్లాడారు.

వైయస్‌ఆర్ కుటుంబానికి జరుగుతున్న అన్యాయంపై‌ రాష్ట్ర ప్రజలంతా తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారని అమరనాథరెడ్డి చెప్పారు. డిసెంబర్ 5‌వ తేదీన తాను పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో స్థానిక సాయినగర్‌లో జరిగే బహిరంగ సభలో అధికారికంగా సభ్యత్వం తీసుకుంటానని చెప్పారు. వైయస్‌ఆర్ సీపీని అడ్డు‌కోవడమంటే వెలిగే సూర్యుడ్ని అడ్డుకున్నట్లేనని ఆయన హెచ్చరించారు.
Back to Top