తక్షణమే సహాయక చర్యలు చేపట్టండి

హైదరాబాద్, 24 అక్టోబర్ 2013:

రాష్ట్ర ప్రజలను తీవ్రంగా వణికిస్తున్న భారీ వర్షాలపై వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి స్పందించారు. భారీ వర్షాల కారణంగా ముంపు బెడదను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శ్రేణులు ఇప్పటికే సహాయక చర్యల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి గురువారం ఉదయం నుంచే ముంపు ప్రాంతాల్లోని వరద నష్టంపై ఆరా తీశారు. భారీ వర్షాల బారిన పడిన జిల్లాల నాయకులకు ఫోన్ చేసి తాజా పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా ఏయే జిల్లాల్లో అత్యధిక ఆస్తి, పంట నష్టం వాటిల్లిందో సమాచారాన్ని సేకరించారు. లోతట్టు ప్రాంతాలలోని ప్రజల కోసం ఏర్పాటు చేసిన సహాయ పునరావాస ఏర్పాట్ల గురించి సమాచారం తీసుకున్నారు.

భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉన్న ఒంగోలులో సహాయక చర్యలను స్థానిక ఎమ్మెల్యే, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న బాధితులను ఆయన దగ్గర‌ ఉండి మరీ పునరావాస కేంద్రాలకు తరలించారు. బాధితుల కోసం భోజనం ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను బాలినేని ఆదేశించారు. తుపాను బాధితులకు బాలినేని స్వయంగా భోజనం వడ్డించి సేవలు చేశారు.

Back to Top