రండమ్మా.. సమైక్య శంఖారావం సభకు!

హైదరాబాద్, 21 అక్టోబర్ 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 26న హైదరాబాద్‌ ఎల్‌బి స్టేడియంలో నిర్వహించే సమైక్య శంఖారావం బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు జోరందుకున్నాయి. పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఈ భారీ బహిరంగ సభ జరగనున్నది. సీమాంధ్రలోని మొత్తం 13 జిల్లాల్లోనూ మహిళలు సమైక్య శంఖారావం సభలో పాల్గొనేందుకు ఉరకలెత్తిన ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. తమ ఇళ్లల్లో జరిగే శుభ కార్యాలకు పిలిచిన విధంగా సమైక్య శంఖారావం సభకు తరలిరావాలంటూ ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి మరీ ఆహ్వానిస్తున్నారు. ఊరూరా దండోరాలు కూడా వేయిస్తున్నారు.

రాష్ట్రాన్ని అడ్డగోలుగా ముక్కలు చెక్కలు చేయవద్దని, సమైక్య రాష్ట్రంగానే ఉంచాలన్న ఏకైక లక్ష్యంతో పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపునకు స్పందించిన సీమాంధ్రలో ఉద్యమాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. దీనితో పాటుగా హైదరాబాద్లో జరిగే సమైక్య శంఖారావం సభలో పాల్గొనేందుకు సన్నాహాలు కూడా విస్తృతంగా కొనసాగుతున్నాయి. సమైక్య శంఖారావానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలంటూ పలువురు స్వచ్ఛందంగా పిలుపునిస్తున్నారు.

వైయస్ఆర్ జిల్లా పులివెందులలో డాక్ట‌రం ఈసీ సుగుణమ్మ ఆధ్వర్యంలో వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మహిళా గర్జన‌తో పాటు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా పులివెందుల తహసిల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ నాయకులు, శ్రేణులు రిలే దీక్షలు చేస్తున్నారు.‌ సమైక్యాంధ్రకు మద్దతుగా కడప మాజీ  మేయర్ రవీంద్రనా‌థ్‌రెడ్డి సతీమణి అరుణమ్మ ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ చేశారు. కోటిరెడ్డి సర్కిల్‌లో మానవహారం నిర్వహించారు.‌

విశాఖపట్నం జిల్లా చోడవరంలో నియోజకవర్గం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లిలో పార్టీ నాయకుడు కొణతాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ మహిళా విభాగం కార్యకర్తలు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు.

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా మానవహారం, అట్లతద్ది చేశారు. ఈ కార్యక్రమాలు ద్వారా సమైక్య నినాదాన్ని వినిపిస్తూ, సమైక్య శంఖారావం సభకు వచ్చేందుకు అభిమానులు, పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Back to Top