ఇలాగైతే ఇక చట్టాలెందుకు?: శ్రీమతి భారతి

హైదరాబా‌ద్, 27 మే 2013:

అరెస్టయిన వ్యక్తికి చట్టం ప్రకారం 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలని, కానీ‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, తన భర్త శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని అరెస్టు చేసి ఏడాది పూర్తయినా బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని‌ శ్రీమతి వైయస్‌ భారతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగైతే ఇక చట్టాలు ఎందుకని ఆమె ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలబడినందుకే తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆమె అన్నారు. తన మామగారు మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మూడున్నర దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ పార్టీకి సేవలు చేశారని, రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యారని అలాంటి తమ కుటుంబానికే ఇంత అన్యాయం జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. శ్రీ వైయస్ జగ‌న్ నిర్బంధా‌నికి నిరసనగా హైదరాబాద్ నెక్లె‌స్‌రోడ్‌లోని పీపుల్సు ప్లాజా నుంచి వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ...  సిబిఐ దర్యాప్తు మొదలు పెట్టి రెండేళ్ళు అవుతున్నా శ్రీ జగన్‌కు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా సంపాదించలేదని శ్రీమతి భారతి తెలిపారు. విచారణ చేయకుండానే శ్రీ జగన్‌ను మొదటి ముద్దాయిగా ఎలా పేర్కొంటారని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఒక్క ప్రశ్న అడగకుండానే మూడు చార్జిషీట్లు ఎలా వేశారన్నారు. ఒక వ్యక్తి హక్కును హరిస్తూ తన భార్య, పిల్లలకు దూరంగా ఉంచే అధికారం కాంగ్రెస్‌, సిబిఐలకు ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు.

ప్రజలతో ఉండాలనుకోవడమే తమ కుటుంబం, శ్రీ జగన్ చేసిన తప్పా అని శ్రీమతి భారతి ప్రశ్నించారు. జైల్లో ఉన్నప్పటికీ శ్రీ జగన్ ఎంతో ధైర్యంగా ఉన్నారని‌ ఆమె చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని చెప్పారన్నారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఏడాది కాలంగా అక్రమంగా నిర్బంధించినందుకు నిరసనగా
సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని పీపుల్సు ప్లాజా వద్ద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌
ఆధ్వర్యంలో భారీ ఎత్తున కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో
పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ, శ్రీ జగన్‌ సతీమణి శ్రీమతి
భారతి, ఇతర కుటుంబ సభ్యులు, పార్టీ సీనియర్‌ నాయకులు, వేల సంఖ్యలో పార్టీ
శ్రేణులు పాల్గొన్నారు.

Back to Top