ప్రజా సంక్షేమం, పవిత్ర ఆశయం, దేశ ప్రయోజనాల కోసం ఎందరో నాయకులు, సంఘ సంస్కర్తలు పాదయాత్రలు, దీక్షలు చేపట్టారు. ఆదిశంకరాచార్యులు భారతదేశంలో హిందూ మతాన్ని సంఘటిత పరచడానికి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేసిన పాదయాత్ర అత్యంత ఆదర్శవంతమైనది. ఉప్పు సత్యాగ్రహం, దండియాత్ర పేరుతో విదేశీ వస్త్రాల బహిష్కరణ, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని నింపడానికి మహాత్మగాంధీ పాదయాత్ర చేశారు. గౌతమ బుద్ధుడు, వివేకానందుడు, వినోబాబావే, ఉత్తర భారత దేశంలో నిమ్న కులాల వారు అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమాజోద్ధరణకు యాత్రలు చేశారు. రాష్ట్రంలోని ఇచ్ఛాపురం నుండి నెల్లూరు జిల్లాలోని తడ వరకు 1937లో రైతు యాత్ర పేరు తో పాదయాత్ర చేపట్టారు.
ఆనాటి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కార్యదర్శులు కుమ్మారెడ్డి సత్యనారాయణ, నండూరు ప్రసాదరావు, సీహెచ్. వాసుదేవరావు తదితరులు జమిందారీ వ్యవస్థ రద్దు కోరుతూ.. ఇనాం, సోత్రియ భూములు రైతులకు పంచాలని, రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పాదయాత్ర నిర్వహించా రు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత 1954లో ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు వ్యవసాయ కూలీ సంఘం ఆధ్వర్యంలో బంజరు భూములు, ఇనామ్ భూముల పంపిణీ కోరుతూ పాదయా త్ర చేశారు. ఇది ఎంతో విలక్షణంగా సాగింది. 1980 దశకంలో మాజీ ప్రధాని చంద్రశేఖర్.. భారతదేశ సందర్శన అవగాహన కోసం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు.
1986లో వైయస్ పాదయాత్రనిరంతర కరువు పీడిత రాయలసీమ జిల్లాలకు సేద్యపు నీటి సౌకర్యం పెంపొందించడం కోసం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 45 వేల క్యూసెక్కులకు పెంచాలని 1986లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి లేపాక్షి నుండి పోతిరెడ్డిపాడు వరకు దాదాపు 400 కిలోమీటర్లు పాదయాత్ర చేశా రు. ఆయనే 2003లో చేవెళ్ల నుండి ఇచ్ఛాపురం వరకు మండు వేసవిలో సుమారు 1500 కిలోమీటర్ల మేర ప్రజాప్రస్ధాన యాత్ర చేశారు. ఈ పాదయాత్ర రైతాంగంలో నెలకొన్న నిరాశ నిస్పృహలను తొలగించి వారిలో ఆత్మవిశ్వా సం కలిగించింది.
పై పాదయాత్రలన్నీ ఒక ధ్యేయంతో, ఒక చారిత్రక అవసరంగా సామాజిక సమస్యల పరిష్కారానికి ఉద్భవించిన ఉద్యమాలుగా, దీక్షలుగా చరిత్రకెక్కాయి. నేడు చంద్రబాబు 2300 కిలోమీటర్ల పాదయాత్ర ‘మీకోసం వస్తున్నా’ పేరుతో హిందూపురం నుంచి చేపట్టారు. ఈ విషయంలో బాబు గారి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఒకనాటి బిల్ గేట్స్, జార్జ్ బుష్, ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడి సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ, బహుళజాతి సంస్థలకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ భారత ప్రధానులను నియమించే స్థాయిలో చక్రం తిప్పిన ఆయన పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం సర్వనాశనమైంది. రైతుల మొట్టమొదటి ఆత్మహత్య జిల్లాలోని చియ్యేడు గ్రామానికి చెందిన బోయ నరసింహులుతో ప్రారంభం కావడం ఈ సందర్భంగా ప్రజలు గుర్తుంచుకోవాలి. ఈ జిల్లాలో బాబు హయాంలో దాదాపు 700 ఆత్మహత్యలు నమోదయ్యాయి.
రైతుల ఆత్మహత్యలు అత్యంత అనాగరికమని.. ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలని జిల్లాలో ని మేధావులు, రచయితలు, కవులు, కళాకారు లు, రైతు సంఘాలు ముక్తకంఠంతో నినదించా రు. ఆత్మహత్యలకు ప్యాకేజీలు ప్రకటిస్తే రైతు ల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని చంద్రబాబు ఈ ప్రతిపాదనను అసహ్యించుకున్నారు. నాడు జిల్లాలో విద్యుత్ సరఫరా సరి గా లేక బోరుబావుల కింద పంటలూ ఎండిపోయాయి. పంట దిగుబడిలేక.. కరువుతో అల్లా డే రైతులు కరెంటు బకాయిలు చెల్లించలేకపోయారు. విద్యార్థులకు ఫీజులు చెల్లించి ఉన్నత చదువులు చదివించుకోలేకపోయారు. పంట లు పండక రుణాలు చెల్లించలేక.. బ్యాంకుల ఒత్తిళ్లకు తట్టుకోలేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఈ పరిస్థితిలో పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు సామాజిక భద్రతగా భావించి మరింత ఎక్కువ మోతాదులో ఇవ్వాలని, రుణాలు మాఫీ చేయాలని, రైతులకు పెట్టుబడిగా రుణ సౌకర్యం కల్పించాలని రాష్ట్రంలోని రైతు సంఘాలు, మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు చంద్రబాబును డిమాం డ్ చేశారు. ఇవేవీ ఆ రోజుల్లో బాబు పరిగణనలోకి తీసుకోలేదు. విద్యుత్ బకాయిలు చెల్లించ ని రైతుల విద్యుత్ మీటర్లను తొలగించి ప్రభు త్వ విద్యుత్ కార్యాలయాల్లో ఉంచారు. బ్యాంకుల్లో రైతు కుటుంబాలు తాకట్టు పెట్టిన బంగారు నగలు, భూములను వేలం వేస్తామని దినపత్రికల్లో పేజీలకు పేజీలు బ్యాంకు అధికారులు ప్రకటనలు ఇచ్చినా మిన్నకుండిపోయారు. దీంతో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపా ధి అవకాశాలు లేక కరువు కోరల్లో విలవిలలాడిన రైతులు, రైతు కూలీలు వలసల బాట పట్టారు. ఆయన అనుసరించిన ప్రపంచ బ్యాంకు అనుకూల విధానాల వల్ల గ్రామీణ ప్రాంతాలు వల్లకాడయ్యాయి. గ్రామీణ ప్రాంతాలను సంక్షోభంలోంచి బయట పడేయడానికి, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు, సేద్యపు నీటి సౌకర్యాల కల్పనకు, రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా ఇవ్వడంలో ఘోరంగా వైఫల్యం చెందారు. పారిశ్రామికీకరణకు ఆయన చేసిందంటూ ఏమీలేదు. హిందూపురంలో ఏర్పాటు చేసిన నిజాం చక్కెర ఫ్యాక్టరీని అప్పనంగా రేణుక షుగర్స్ లిమిటెడ్ అనే కంపెనీకి కారుచౌకగా అప్పగించారు.
అప్పుడు రైతులు ఆందోళన చేస్తే ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని వాగ్దానం చేసి చేతులు దులుపుకున్నారు. జిల్లాలో హంద్రీ-నీవా పథకం ప్రాధాన్యతను ఆనాటి తెలుగుదేశం నేత, మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య పార్టీ సమావేశాల్లో ప్రస్తావిస్తే దండించి.. హెచ్చరించే స్థాయిలో ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. తెలుగుదేశం నాయకులతో సహా జిల్లాలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు పది టీఎంసీల కృష్ణా జలాలు అనంతపురం జిల్లాకు తరలించాలని చేసిన ప్రతిపాదనను ఏనాడూ ఆయన ఖాతరు చేయలేదు. ఆయన తొమ్మిదేళ్ల పరిపాలనలో ఈ జిల్లాకు చేసిందంటూ ఏమీలేదు. పెపైచ్చు ఆయన అనుసరించిన విధానాల వల్ల వివిధ రంగాలు కుదేలయ్యాయి. ప్రపంచ వాణిజ్య సంస్థతో చేసుకున్న ఒప్పందాల మూలంగా పామోలిన్ ఆయిల్ దిగుమతి ఇబ్బడిముబ్బడిగా జరిగింది. చైనా శిల్క్ దిగుమతి పెరిగింది.
అంతర్జాతీయ విపణి నుండి పెద్ద ఎత్తున వస్త్రాల దిగుమతి పెరిగింది. ఫలితంగా వేరుశనగ నూనెకు గిట్టుబాటు ధర పడిపోయింది. మల్బరీ తోటల పెంపకంలో అగ్రస్థానంలో ఉన్న జిల్లాలో మల్బరీ పండించే రైతాంగం విలవిలలాడిపోయింది. విదేశీ వస్త్రాల దిగుమతి ప్రవాహం ఉధృతికి చేనేత రంగం కకావికలమైంది. జిల్లా తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. వ్యవసాయం దండగ అని, ఉచిత విద్యుత్ వల్ల కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవచ్చని, కమ్యూనిజానికి కాలం చెల్లిపోయిందని, ఉన్నదంతా టూరిజమని, చరిత్ర చదవడం అనవసరమని ఇలా ఎన్నో ప్రవచనాలను బాధ్యతారహితంగా చేశారు. నేడు రాష్ట్రంలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రజలను ప్రజా సమస్యలపై సమీకరించి చైతన్యపరచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడపాల్సిన రాజకీయ గురుతర బాధ్యత నుండి చంద్రబాబు తప్పించుకునేందుకు నేడు పాదయాత్ర చేస్తున్నారు. రాష్ట్రంలోని సమస్యలకు పరిష్కారాన్ని సూచించక, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతి చోటు చేసుకుందని, దీనికంతటికీ వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డిలే కారణమంటూ నిందాపూర్వకమైన ఆరోపణలు చేస్తూ.. సోనియాగాంధీతో అక్రమంగా చేతులు కలిపి జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా జైలులో ఉంచడానికి తీవ్రంగా ప్రయత్నించారు.
జగన్ ప్రాభవం చూసి బాబు గుబులుజైలుకు వెళ్లినా జగన్ ప్రాభవం తగ్గకపోగా.. దినదిన ప్రవర్తమానమవడం బాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సీబీఐని అడ్డం పెట్టుకుని జగన్‌ను నిర్భందించే పరిస్థితులు సాగని కాలం రాబోతోంది. తాను స్వయానా పీకల్లోతు అవినీతి అక్రమాలలో కూరుకుపోయి.. రామోజీ, రిలయన్స్ అంబానీల తోడుగా తిమ్మిని బమ్మి చేసి ఎంతో కాలం తప్పించుకోలేరు.
కేంద్ర ప్రభుత్వం బొగ్గు, 2జీ స్పెక్ట్రమ్, ఒలంపిక్స్ తదితర స్కాంలకు తోడు.. డీజిల్ ధరల పెంపు, ఎఫ్‌డీఐల సంక్షోభంతో ప్రజల్లో ఆదరణ కోల్పోయింది. 24 గంటల్లో కనీసం నాలుగు గంటలు కూడా విద్యుత్ సక్రమంగా పంపిణీ చేయలేక రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురవుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ వైఎస్సార్‌సీపీ బలపడుతోంది. ఈ అంశాలన్నింటినీ పక్కదోవ పట్టించడానికే చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్రతో ఆయన పార్టీనే తీవ్ర సంక్షోభంలో పడబోతోంది. చైతన్యవంతమైన రాష్ట్ర ప్రజలు బాబు తీరును నిశితంగా గమనిస్తున్నారు. ప్రజల జ్ఞాపకశక్తిని తక్కువ అంచనా వేయడానికి చంద్రబాబు చేసే ప్రయత్నాలు ఫలించవని చెప్పక తప్పదు. అధికారమే అవధిగా సాగుతున్న యాత్రకు ఆ పార్టీ కార్యకర్తలు హాజరైనంత మాత్రనా ఆయన లక్ష్యం నెరవేరుతుందన్న భరోసా లేనే లేదు.