గుడిసెల్లేని రాష్ట్రమే జగన్‌బాబు ఆశయం

కాకినాడ:

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి కలలు కన్నట్టుగా గుడిసెల్లేని రాష్ట్రాన్ని చూడాలన్నదే జగన్‌బాబు లక్ష్యం అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖ పార్లమెంటరీ స్థానంలో పార్టీ అభ్యర్థి శ్రీమతి వైయస్‌ విజయమ్మ స్పష్టంచేశారు. మన దేశంలో 50 ఏళ్లలో 47 లక్షల ఇళ్లు కడితే వైయస్ఆర్ తన ఐదేళ్ల మూడు నెలల పాలనలో ఏకంగా 48 లక్షల ఇళ్లు కట్టి చూపించా‌రన్నారు. ఇప్పుడు జగన్‌బాబు ఏడాదికి 10 లక్షల చొప్పున రానున్న ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు కట్టిస్తానని మాట ఇచ్చారన్నారు. ఆ ఇళ్ళను అక్కాచెల్లెళ్ల పేరిటే రిజిస్టర్ కూడా చేయించి ఆ ఇళ్లపై రుణాలందిస్తానని చెబుతున్నా‌రన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం, రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో శ్రీమతి విజయమ్మ వైయస్ఆర్ జనభేరి నిర్వహించారు.

ఆ మహానేత వైయస్ఆర్‌లో ఉన్న దీక్ష, తెగువ, పట్టుదల జగన్‌బాబులోనూ ఉన్నాయ‌ని శ్రీమతి విజయమ్మ అన్నారు. ఒకసారి మాట ఇచ్చారంటే వాళ్ల నాయన మాదిరిగానే ఆ మాట తప్పేవారు కాదని భరోసా ఇచ్చారు. 'నన్ను నమ్మండి. జగన్‌బాబును ఆశీర్వదించండి’ అని శ్రీమతి విజయమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

‘నాడు రాజశేఖరరెడ్డి నుంచి నేడు నా బిడ్డలు జగన్‌బాబు, షర్మిలపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు మేము మర్చిపోలేం. మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో కూడా అర్థం కావడం లేదు. మా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు మిమ్మల్ని మా గుండెల్లో ఉంచుకుంటాం. కష్టసుఖాల్లో మీకు అండగా నిలుస్తాం’ అని ప్రజలకు ఆమె హామీ ఇచ్చారు.

Back to Top