రైతులకు పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలి

విజయనగరం‌, 30 అక్టోబర్ 2013:

భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారంతో పాటు ఇన్‌పుట్‌ సబ్సిడీని త్వరగా అందజేయాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ తరఫున పంట నష్టంపై తాము ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. విజయనగరం జిల్లాలో వరద ముంపునకు గురైన పూసపాటిరేగ మండలం కొవ్వాడ, భోగాపురం తదితర ప్రాంతాల్లో శ్రీమతి విజయమ్మ బుధవారం పర్యటించారు. వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆమె పరామర్శించారు.

ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ.. రైతుల తరపున తాము అసెంబ్లీలో పోరాడతామన్నారు. రైతులంతా ధైర్యంగా ఉండాలని శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తి సంగతిని శ్రీమతి విజయమ్మ రైతులకు తెలిపారు. కోర్టు అనుమతిస్తే జగన్‌బాబు నేరుగా వచ్చి రైతులను పరామర్శిస్తారని ఆమె తెలిపారు. శ్రీ వైయస్ జగ‌న్ అధికారంలోకి వచ్చిన ఆరు‌ నెలల్లో భారీ వర్షాల కారణంగా నిరాశ్రయులైన వారందరికి పక్కా ఇళ్లు కట్టిస్తారని ఆమె బాధితులకు భరోసా ఇచ్చారు.

పేదల అభ్యున్నతి కోసం దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి నిరంతరం శ్రమించారని ‌శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. శ్రీ వైయస్ జగ‌న్ కూడా ఆ మహానేత ‌బాటలోనే నడిచి ఆయన స్వప్నాలను సాకారం చేస్తారని శ్రీమతి విజయమ్మ చెప్పారు.

Back to Top