ముద్రగడ విషయంలో ప్రభుత్వ వైఖరి దారుణంహామీలు నిలబెట్టుకోలేక అరాచక పాలన సాగిస్తున్నారుముద్రగడ కుటుంబసభ్యులపై దాడి చేయడం హేయనీయంముద్రగడ దీక్షకు వైయస్సార్సీపీ పూర్తి మద్దతు ఇస్తుందిముద్రగడ ఆరోగ్య క్షీణించకముందే సమస్యను పరిష్కరించాలిమీడియాపై నియంత్రణ ఎత్తివేయాలిః కన్నబాబు
హైదరాబాద్ః ముద్రగడ పద్మనాభం విషయంలో ప్రభుత్వ వ్యవహారశైలి దారుణంగా ఉందని వైయస్ఆర్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండ చూసి.. ఈ రాష్ట్రంలో టీడీపీకి ఓటేసి తప్పు చేశామని జనం అనుకుంటున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడారు. రాజమండ్రిలో యుద్ధ వాతావారణం సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముద్రగడకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు.
టీడీపీ మేనిఫెస్టోలో కాపులను బీసీలలో చేరుస్తామని స్పష్టంగా చెప్పారని, ఏడాదిన్నర పాటు కాలయపాన చేయకుండా ముందే మంజునాథ కమిటీ నియమించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని అన్నారు. ఈవాల్టి వరకు నిబంధనలు, షెడ్యూలు రూపొందించలేదని, ఇప్పుడు ఆదరా బాదరాగా నివేదిక ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని, దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వానికి ఈ అంశంపై చిత్తశుద్ధి లేదని తెలుస్తోందని ఆయన చెప్పారు. నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ఐదు రోజుల తర్వాత ముద్రగడ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉందని తెలిసినా.. ఇలా చేయడం తగునా అని ప్రశ్నించారు. పోలీసులను సాకుగా తీసుకొని కక్షసాధింపుకు దిగడం దారుణమన్నారు. తానూ 20 ఏళ్లు మీడియాలో పనిచేశానని, కానీ ఎప్పుడూ మీడియాపై ఇంతటి నిర్బంధం లేదని చెప్పారు.
ముద్రగడ కుమారుడిని, కోడలిని లాఠీలతో కొట్టడం స్పష్టంగా వీడియోలలో కనిపిస్తోందని, ఇదంతా వ్యూహం ప్రకారం చేస్తున్నారని అన్నారు. ముద్రగడను కనీసం ఒక మనిషిగా కూడా చూడటం లేదని.. ప్రభుత్వం చాలా తప్పు చేస్తోందని కన్నబాబు తెలిపారు. ముద్రగడ కుమారుడిని చూస్తుంటే.. మీ అరాచక పాలన ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. కాపులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక.. దానిపై ఒక నాయకుడు ఉద్యమిస్తుంటే ఆ ఉద్యమాన్ని అణిచేస్తున్నారని విమర్శించారు. కొన్ని కులాలను ఎస్సీలలో చేరుస్తామన్నారు, రేపు వారిని కూడా ఇలాగే అణిచేస్తారా అని ప్రశ్నించారు. గతంలో ముద్రగడ దీక్ష చేసినప్పుడు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులు వచ్చి ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని చెప్పారని, కానీ అలాంటి ప్రయత్నం ఏమీ జరగలేదని అన్నారు.
మీ ఇష్టానుసారంగా కొందరు వ్యక్తులను, ఒక పార్టీని టార్గెట్ చేస్తున్నారని, ఏ ఆధారాలు లేకుండా ఎలా అభాండాలు వేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను తాము ప్రోత్సహించబోమని.. అయితే ఇప్పుడు అరెస్టు చేసినవాళ్ల ప్రమేయం ఏంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ముద్రగడను చూసేందుకు వచ్చిన వారిని ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. ఆయన కోసం వచ్చినవారిని అక్రమంగా నిర్బంధిస్తున్నారని, అసలు రాజమండ్రికే వెళ్లనివ్వకుండా.. యుద్ధవాతావరణాన్ని సృష్టిస్తున్నారని, ఇది మంచిపద్ధతి కాదని అన్నారు. ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబసభ్యుల పరిస్థితి ఎలా ఉందో బహిరంగపర్చాలని, మీడియాపై నియంత్రణ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు పూనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చంద్రబాబును హెచ్చరించారు.
ముద్రగడ ఆరోగ్యం ఏమైనా తేడా వచ్చి ఇబ్బంది అయితే కొత్త సమస్యలు చుట్టుకుంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎవరైనా దీనిపై మాట్లాడితే అదే సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలను రంగంలోకి దించి తిట్టిస్తున్నారని, కులవ్యవస్థనే కొనసాగిస్తాం అన్నట్లుగా ఈ ప్రభుత్వ పాలన ఉందని మండిపడ్డారు. కులాల వారీగా మీరు చేస్తున్న కార్యక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించకుండా, రాజకీయ సమస్యలా భావిస్తే ఎప్పటికీ పరిష్కారం కాదని తెలిపారు. ముద్రగడ ఆరోగ్యం క్షీణించకముందే సమస్యను పరిష్కరించాలన్నారు. ముద్రగడ ఉద్యమానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని కన్నబాబు స్పష్టం చేశారు.