అవినీతి, అరాచక పాలనపై పోరుబాట

కరువును ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలం
అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలకు ప్రలోభాలు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బాబు
ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ ఆందోళన
మాచర్లలో జరిగే ధర్నాకు వైఎస్ జగన్ హాజరుః బొత్స

విశాఖపట్నం: రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. గుంటూరు జిల్లా మాచర్లలో జరిగే ధర్నాలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా సాధించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని బొత్స విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. విచ్చలవిడిగా సంపాదించిన అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనే కార్యక్రమాలు చేస్తూ బాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడని మండిపడ్డారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 

బాబు అవినీతి, ఎమ్మెల్యేల బేరసారాలను చూసి ఢిల్లీ పెద్దలు ముక్కున వేలేసుకున్నారని బొత్స చెప్పారు. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుందా అంటూ  ఆశ్చర్యపోయారని తెలిపారు.  జాతీయ స్థాయిలో దీనిపై  డిబేట్ జరగాలని అందరూ ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు. బాబు ఇలాంటి వెధవ పనులకు పూనుకోవడం సిగ్గుచేటని బొత్స ధ్వజమెత్తారు. గతంలో వైఎస్సార్సీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేల చేత వైఎస్ జగన్ రాజీనామా చేయించి...ప్రజల్లోకి వెళ్లి మళ్లీ వారిని గెలిపించుకున్న విషయాన్ని బొత్స గుర్తు చేశారు.  రానున్న రోజుల్లో బాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 
Back to Top