తమ స్వార్థం కోసం ఎవరినైనా బలిపెట్టగల సమర్థులు ఈ తండ్రీకొడుకులు

30–05–2018, బుధవారం 

నరసాపురం, పశ్చిమగోదావరి జిల్లా

ప్రముఖ దర్శకులు, చిత్రకారులు, బహుముఖ ప్రజ్ఞాశాలి
బాపుగారు నడయాడిన నేల.. ఎందరో కవులు, కళాకారులు, సాహితీవేత్త లు, న్యాయ కోవిదులకు
పుట్టిల్లు.. మన అక్క చెల్లెమ్మల చేతి అల్లికలకు దేశ విదేశాల్లో ఖ్యాతి
తెచ్చిపెట్టిన ప్రాంతం.. పశ్చిమగోదావరి జిల్లాలో సముద్ర తీరం ఉన్న ఏకైక
నియోజకవర్గం నరసాపురం. ఎన్నో విశిష్టతలున్న ఈ ప్రాంతం ‘అన్నీ ఉన్నా.. అల్లుడి
నోట్లో శని’ అన్న
చందంగా అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచింది. 


రోజు ఉదయం ప్రజల జీవితాల్లో ఆరోగ్యానికి ఉండే ప్రాధాన్యతను, పేదల కుటుం బాలపై మద్యం
దుష్ప్రభావాలను తెలియజేసే ఉదంతాలు ఎదురయ్యాయి. లిఖితపూడి వద్ద స్వప్న అనే
చెల్లెమ్మ కలిసింది. నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్లు ఉంటున్న పూరిల్లు
కాలిపోయి.. ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయట. పూట గడవడమే కష్టంగా ఉన్న రోజుల్లో.. వైద్యం
చేయించుకునే స్తోమతలేని పరిస్థితుల్లో.. నాన్నగారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ
ద్వారా కార్పొరేట్‌ ఆస్పత్రిలో ముఖానికి, మెడకు ప్లాస్టిక్‌ సర్జరీ
చేయించుకున్నానని చెబుతుంటే.. ఆ చెల్లెమ్మ కళ్లలో ఒక రకమైన ఆనందం కనిపించింది.

ఆమె
చేతులకు తదుపరి చికిత్సలు చేయించుకోవాల్సి ఉంది. కానీ నేటి పాలనలో ఆరోగ్యశ్రీ నిర్వీర్యమ
వడంతో సర్జరీ చేయించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. మద్యానికి బానిసై, ఆరోగ్యం చెడిపోయి, నాన్న కూడా చనిపోయాడని..
బతుకుదెరువుకోసం తన తల్లి గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిందని కన్నీళ్లు పెట్టుకుంది. ‘అన్నా.. నేను ఎవరిపైనా
ఆధారపడి బతకాలనుకోవడం లేదు.. చిన్నపాటి ఉపాధి దొరికినా నా కాళ్లపై నేను నిలబడగలను’ అని ఆ చెల్లెమ్మ
చెబుతుంటే.. ఆమె ఆత్మస్థైర్యానికి ముగ్ధుడినయ్యాను. 

శామ్యూల్‌
అనే సోదరుడిదీ ఇలాంటి పరిస్థితే. నాన్నగారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 పథకాలు తన కుటుంబాన్ని
ఎంతగా ఆదుకున్నాయో చెప్పాడు. తన అన్నపిల్లలకు కరెంటు షాక్‌ తగిలితే.. 108 అంబులెన్స్‌ సకాలంలో రావడం
వల్ల ఆస్పత్రిలో చేర్పించడంతో పెద్ద ప్రమాదం నుంచి గట్టెక్కారట. తానూ రోడ్డు
ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు 108 వాహనంలో ఆస్పత్రికి చేరి
ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్‌లు చేయించుకున్నట్లు చెప్పాడు. అంతేకాదు.. తన
అమ్మకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వస్తే ఆగమేఘాలపై ఆస్పత్రికి చేర్చింది కూడా 108 అని తెలిపాడు. ‘ఇలా మా ఇంటికే మూడుసార్లు 108 సేవలందించిందన్నా’ అన్నాడు ఆ సోదరుడు.

ఇదే
కుటుంబంపై మద్యం మహమ్మారి తీవ్ర దుష్ప్రభావాన్ని చూపింది. మద్యం వల్ల శామ్యూల్‌
తండ్రి చనిపోయాడట. ఉన్న అన్నలిద్దరూ తాగుడుకు బానిసలై 40 ఏళ్ల వయసులోపే లివరు పాడై
కన్నుమూశారట. ఈ రెండు ఉదంతాలూ మనసును కలచివేశాయి. నాన్నగారు ఆరోగ్యశ్రీ, 108 ద్వారా ఎంతోమందికి
పునర్జన్మ ప్రసాదిస్తే.. చంద్రబాబు మాత్రం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడంతో పాటు..
ప్రతి ఊరిలో బెల్టు షాపులు పెట్టి మద్యాన్ని ఏరులై పారిస్తూ.. ఎన్నో కుటుంబాల
పతనానికి కారకుడవుతున్నాడు. స్వప్న, శామ్యూల్‌ ఇరువురూ కోరింది
ఒక్కటే.. ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం తేవాలని.. మద్యం మహమ్మారిని తరిమివేయాలని. 

గ్రామ
పంచాయతీల్లో పనిచేసే పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికులు కలిసి తమ బాధను
చెప్పుకొన్నారు. ‘సార్‌..
ఉద్యోగ భద్రత లేకపోయినా.. అతి తక్కువ జీతాలైనా.. తరాల నుంచి ఈ పనులు
చేసుకుంటున్నాం. ఇప్పుడేమో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి లోకేశ్‌ ఈ పారిశుద్ధ్య పనులను
కాంట్రాక్టర్లకు అప్పజెప్పేందుకు పూనుకున్నాడు. మా పొట్టగొట్టేందుకు సిద్ధమయ్యాడు’ అని చెబుతుంటే.. ఆవు చేలో
మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అనే సామెత గుర్తుకొచ్చింది.

పెదబాబు
బాటలోనే చినబాబు కూడా నడుస్తున్నాడు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం.. అక్రమ సంపాదన
కోసం.. ఎవరినైనా, దేనినైనా
బలిపెట్టగల సమర్థులు ఈ తండ్రీకొడుకులు. చివరకు ప్రజల జీవితాలనైనా.. రాష్ట్ర
ప్రయోజనాలనైనా. నెలకు మూడువేలో నాలుగువేలో సంపాదించుకుంటూ బతుకు భారంగా ఈడ్చే
చిన్నపాటి ఉద్యోగుల నోటికాడ కూడును గద్దల్లా తన్నుకుపోతున్న ఈ పెద్దల్ని ఏమనాలి?

ముఖ్యమంత్రిగారికి నాదో
ప్రశ్న..
 ఎన్నికల వేళ కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌
చేస్తానని హామీ ఇచ్చి.. దానిని నెరవేర్చకపోగా, ఉన్న ఉద్యోగాలను సైతం
తీసివేస్తుండటం మానవత్వమేనా? మీ అక్రమ సంపాదన కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం..
పారిశుద్ధ్యం మొదలుకుని, ప్రజారోగ్యం
వరకు ప్రతి రంగాన్నీ ప్రైవేటీకరణ పేరుతో కాంట్రాక్టర్లకు అప్పజెప్పాలనుకోవడం
ధర్మమేనా? 

-వైఎస్‌ జగన్‌

Back to Top